కంటోన్మెంట్‌తో పాటు మల్కాజ్ గిరి ఎంపీ కూడా బీఆర్ఎస్‌దే : కేటీఆర్

by Disha Web Desk 23 |
కంటోన్మెంట్‌తో పాటు మల్కాజ్ గిరి ఎంపీ కూడా బీఆర్ఎస్‌దే : కేటీఆర్
X

దిశ,మేడ్చల్ బ్యూరో : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తో పాటు మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలోనూ ఎగిరేది గులాబీజెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి… నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హై అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడే భాయ్ అంటున్నాడని మండిపడ్డారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే… రేవంత్ రెడ్డి హమారా ఫ్రెండ్ అంటున్నాడని చురకలంటించారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మనిషా… లేక నరేంద్ర మోడీ మనిషా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసినా, అది నేరుగా బిజెపికి లాభం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత 30- 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి స్కాములు, స్కీములు, ట్యాపింగ్ పేర్లతో డ్రామాలాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు పోయి… ఆరు గారడీలు మోపయ్యాయంటూ నిప్పులు చెరిగారు. పాలన చేతకావడం లేదు కాబట్టే లీకు వీరుడిగా మారిండని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అనే నిజం ఒకవైపు… ఇచ్చిన హామీలన్నింటిని పక్కనపెట్టి అబద్ధాలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు… 10 సంవత్సరాలుగా సమాజంలో విషయం నింపుతున్న బీజేపీ ఇంకోవైపు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వారికి ఓటుతో సమాధానం చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, గులాబీ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అంతకుముందు ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు నేతలంతా ఘన నివాళి అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కేటీఆర్.. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ బలంగా ఉందని స్పష్టం చేశారు. అటు తెలంగాణ భవన్ సమావేశానికి ముందు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత ఆధ్వర్యంలో నాయకులు భారీగా తెలంగాణ భవన్ కు పయనమయ్యారు.


Next Story

Most Viewed