గంజాయి మత్తులో యువత.. యువకులు, విద్యార్థులే టార్గెట్

by Disha Web Desk 20 |
గంజాయి మత్తులో యువత.. యువకులు, విద్యార్థులే టార్గెట్
X

దిశ, చేర్యాల : విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే విరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తుంన్నాయి. చేర్యాలతో పాటు పరిసర గ్రామాలలోని కొంత మంది యువత గంజాయి మత్తులో జోగుతున్నారు.

గంజాయి మాఫియా ఇంటర్, డిగ్రీ విద్యార్థులే లక్ష్యంగా కొన్ని గ్రామాలను, గ్రామ శివారులో ఉన్నగుట్టలను, అడ్డంగా చేసుకొని వ్యాపారానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులే మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరుఫరా చేస్తున్న వ్యక్తులకు పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా నలుగురు పరారీ కాగా, ఇద్దరు పట్టు బడ్డారు. ఈ సంఘటన చేర్యాలలో గంజాయి ఏ మేర విక్రయాలు సాగుతున్నాయో అనడానకి నిదర్శనం. కొందరు యువకులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సిగరెట్ లోని తంబాకును దులిపేసి దాని స్థానంలో గంజాయిని నింపుకొని దమ్ము లాగిస్తూ హుక్క తరహాలో యువకులకు అలవాటు చేసింది. మత్తుకు అలవాటు పడిపోయిన యువకులు నేరాలకు అలవాటు పడిపోతున్నారు.

మత్తే ప్రపంచం..

ఒకరితో ఒకరు స్నేహం చేస్తూ గంజాయి వ్యసనాన్ని అంటురోగంగా చేసుకుంటూ మత్తే ప్రపంచంగా యువత గంజాయికి బానిసౌవుతుంది. బానిసలుగా మారిన యువకుల శరీరాకృతి సైతం మారిపోయి మానసిక రోగులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తొలి దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకొని తమ పిల్లలకు కౌన్సిలింగ్ లు ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

తల్లి తండ్రులదే బాధ్యత..

యువత పక్కదారి పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. కాలేజీలకు వెళ్తున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలపై దృష్టి సారించాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం.. చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి

గంజాయికి బానిసలు అవుతున్న యువత చెడువ్యసనాలు పట్టకుండా తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చేర్యాల సీఐ సత్యనారాయణ అన్నారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని ఆయన కోరారు. గంజాయి రవాణా చేసిన, అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. వీటిపై సమాచారం తెలిస్తే నంబర్ 87126 67355 కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 11 మంది పై కేసులు నమోదు చేశామని తెలిపారు. పిల్లలు గంజాయికి బానిసలుగా మారినట్లయితే తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకొస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు అవగాహన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

Next Story