ఆన్ చేయకుండానే వెలుగుతున్న స్ట్రీట్ లైట్స్.. కాలిపోతున్న ప్రజలు సామాన్లు..

by Dishafeatures2 |
ఆన్ చేయకుండానే వెలుగుతున్న స్ట్రీట్ లైట్స్.. కాలిపోతున్న ప్రజలు సామాన్లు..
X

దిశ, వర్గల్ : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో విద్యుత్తు సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వేళాపాళా లేని కోతలు, సరఫరాలో ఇబ్బందులు, చెట్ల ద్వారా అర్థింగ్ పాసై స్విచ్ ఆన్ చేయకుండా వెలుగుతున్న విద్యుత్ లైట్ల వల్ల ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన పలు గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వర్గల్ మండలం గౌరారం 33 / 11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని మైలారం పీడర్‌పై పలు గ్రామాల విద్యుత్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చౌదర్ పల్లి గ్రామంలో గత పది రోజులుగా టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లు, విద్యుత్ బల్బులు కాలిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు వీధుల్లో స్విచ్ ఆన్ చేయకుండా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. వీధి దీపాలు వస్తూ పోతుంటాయి.

రోడ్ల వెంబడి పెరిగిన చెట్లు విద్యుత్ వైర్లకు అల్లుకు పోవడంతో ఎర్తింగ్ పాస్ అవుతుంది. దాంతో విద్యుత్ పరికరాలు కాలిపోతున్నట్లు చౌదర్ పల్లి, మక్త, సింగాయపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ నిధులు దుర్వినియోగమైనట్లు స్పష్టం అవుతుంది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన 33 / 11 కేవీ లైన్ పూర్తిగా డ్యామేజ్ కాగా దానిని మార్చలేదని, మధ్యలో స్తంభాలు కూడా పాత లేదని ప్రజలు తెలుపుతున్నారు. దాని వల్ల లూప్ లైన్లు, అతుకుల కండక్టర్‌తో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. రోడ్ల వెంబడి నాటిన చెట్లకు విద్యుత్ వైర్లు ఆనకుండా సరిచేయాలని, పశువులకు, గొర్రెలకు, మనుషులకు కరెంట్ షాక్ వస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed