ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి : చుక్క రాములు డిమాండ్​

by Disha Web Desk 15 |
ఇంటి నిర్మాణానికి  రూ.5 లక్షలు ఇవ్వాలి : చుక్క రాములు డిమాండ్​
X

దిశ, సంగారెడ్డి : స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, అందుకు అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సాధన కోసం సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. ప్రతిపక్షం కూడా పేదల ఇంటి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో గొప్పగా చెప్పిన రాజీవ్‌ స్వగృహ, రాజీవ్‌ గృహకల్ప వంటి పథకాలు ఉత్తమాటలయ్యాయని గుర్తు చేశారు. పేదల నుంచి డబ్బులు కట్టించుకొని ఇప్పటి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా గొప్పగా చెప్పుకున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం అందని ద్రాక్షలా మారిందని ఆరోపించారు. డబుల్‌ బెడ్​ రూం ఇళ్లను అధికార పార్టీ నాయకులు తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చుకున్నారన్నారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో వేలాది మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొండాపూర్‌లో 5 వేల మందికి, సదాశివపేటలో 5800 మందికి ఇళ్ల స్థలాలిచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా పెద్దోళ్ల కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల్లేని పేదలందిరికీ స్వంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నా కార్యాక్రమానికి పేదలు వేలాదిగా తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గొల్లపల్లి జయరాజు, బీరం మల్లేశం, బి.సాయిలు, అతిమెల మాణిక్యం, యాదగిరి, రమేష్, కృష్ణ, బాలరాజు, ప్రవీణ్ తది తరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed