మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జిల్లా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతోనే జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానని కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలుసుకున్న హరీష్ రావు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డిని కలిపించారని ఆరోపించారు.

ఈ విషయం తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్లు సన్నాయి నొక్కులు నొక్కతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బిగ్ జీరో కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు అమ్ముకునే పనిలో పడిందన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కోమటి చెరువు, హుస్సేన్ సాగర్, మూసీలో వేసినట్లే అన్నారు.

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ మీద పట్టు కోసం బావ, బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం స్పష్టమవుతోందన్నారు. గతంలో వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత హరీష్ రావు సైతం కలిసి అభివృద్ధి పనుల కోసం కలిసినట్లు మీడియాకు చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలను కలుపుకోవడానికి 7 సంవత్సరాలు పడితే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకోవడానికి 7 నెలలు పట్టదన్నారు.

కర్మ సిద్ధాంతం అనుగునంగా బీఆర్ఎస్ పార్టీ గత పాపాలను అనుభవించక తప్పదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా ఇప్పుడు ప్రోటోకాల్ కోసం ఎమ్మెల్యేలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సైతం బీజేపీ 16 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story