అవినీతిని చట్టబద్ధం చేసిన మోదీ సర్కార్

by Disha Web Desk 22 |
అవినీతిని చట్టబద్ధం చేసిన మోదీ సర్కార్
X

దిశ, సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోదీ సర్కార్ అవినీతికి చట్టబద్ధత కల్పించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. జయరాజు ఆరోపించారు. గురువారం కంది మండల కేంద్రంలో సీపీఎం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ… బీజేపీ 2014 ఎన్నికల ముందు నల్ల డబ్బును బయటకు తీసేసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పిందన్నారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్‌ల్లో అత్యధికం బీజేపీ ఖాతాలోకే చేరాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవని సీపీఐ(ఎం) మొదటి నుంచి పోరాడిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని, అధికారం నిలబెట్టుకునేందుకు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వారికి అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ఇప్పటికే సీఏఏ, పౌరసత్వ చట్టం అమలుకు పూనుకుందని, జ్యోతిష్య శాస్త్రం, వాస్తు వంటివి ప్రవేశపెట్టి విద్యా కాషాయీకరణకు యత్నిస్తోందన్నారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధించడం, లొంగదీసుకోవడం, ప్రశ్నించే మేధావులను జైళల్లో పెట్టడం లాంటివి చేస్తోందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సిములు, మండల కార్యదర్శి శ్రీనివాస్ మండల నాయకులు భరత్ పాల్గొన్నారు.


Next Story