అయ్యప్ప పూజలకు తాకిన రాజకీయ సెగ.. ఆందోళనకు దిగిన స్వాములు

by Disha Web Desk 19 |
అయ్యప్ప పూజలకు తాకిన రాజకీయ సెగ.. ఆందోళనకు దిగిన స్వాములు
X

దిశ, అమీన్ పూర్: రాజకీయ మీటింగ్‌లను వదిలి గ్రూప్ రాజకీయాల సెగ అయ్యప్ప పడి పూజలకు తాకింది. ఈ నెల 11న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగా అతిథులకు, స్వాములకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున లింగంపల్లి చౌరస్తా నుండి చిట్కుల్ వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లను జీర్ణించుకోలేని వ్యతిరేకవర్గం నీలం మధు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని ఎక్కడిక్కకడ చింపి వేశారు. భక్తి భావంతో రాజకీయాలకతీతంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను చింపడంపై అయ్యప్ప స్వాములు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలకు సంబంధించిన విభేదాలుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప.. భక్తి భావంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూడడం అవివేకమైన చర్య అని నీలం మధు సన్నిహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలను చింపివేసిన బాధ్యులెవరో కనిపెట్టి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం పటాన్ చెరు ప్రాంతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ యాత్రను పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను వాల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. కాగా, రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ఉదయం వరకు ధ్వంసం చేశారు. ఈ చర్యలతో కలత చెందిన కాట శ్రీనివాస్ గౌడ్ తమ వ్యతిరేకవర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.

రాజకీయంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చింపివేయడంతో ఇతర పార్టీల వారు ఓర్వలేక చింపేశారని కాంగ్రెస్ నాయకులు భావించారు. తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్‌లోని కొందరు ఈ పని చేశారని కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి ఫ్లెక్సీలను ఎవరు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీల చించివేత పంచాయతీ తీవ్ర రూపం దాల్చి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోక ముందే ఈ ఘటనలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.



Next Story