దిగుమతి సమయంలో ఇబ్బంది పెడితే.. మిల్లులకు ధాన్యం ఇవ్వం: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
దిగుమతి సమయంలో ఇబ్బంది పెడితే.. మిల్లులకు ధాన్యం ఇవ్వం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: యాసంగి ధాన్యం కొనుగోళ్లు వారంలోగా ప్రారంభించాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను అదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో యాసంగి వరి ధాన్యం సేకరణ - మద్దతు ధర, పామ్ ఆయిల్ పంట సాగు, భూగర్భ జలాల పెంపుపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు ఎరువుల పంపిణీ, రైతు బంధు తదితర కార్యక్రమాలతో యాసంగిలో రాష్ట్రంలో 57 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు నిరాకరించడంతో ప్రభుత్వం రూ.26వేల కోట్ల ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకుంన్నారు.

రాష్ట్రంలో 2014-15లో రూ.3,700 కోట్ల విలువైన ధాన్యం రైతులు పండించగా, 2021-22 నాటికి రూ. 26,700 కోట్ల విలువైన ధాన్యం పండిస్తున్నారన్నారు. జిల్లాలో 2014-15లో 79,539 మెట్రిక్ టన్నుల రూ.100 కోట్ల విలువైన ధాన్యం పండించగా, 2021-22లో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 1,500 కోట్ల విలువైన ధాన్యం రైతులు పండిస్తున్నారని వివరించారు. కొనుగోలు కేంద్రాలల్లో ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు అన్నీ సిద్ధం చేసి రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఆరబోసిన ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. మిల్లర్లు తేమ శాతం, తాలును సాకుగా చూపి ధాన్యం దిగుమతి సమయంలో ఇబ్బంది పెడితే మిల్లర్లకు ధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో రేషన్ డీలర్లు లేని రేషన్ షాపులను గుర్తించి నెల రోజుల్లోగా కొత్త రేషన్ డీలర్లు నియమించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని మంత్రి ఆదేశించారు.

8 వేల ఎకరాలల్లో సాగు లక్ష్యం..

జిల్లాలో ఈ సంవత్సరం 8వేల ఎకరాలల్లో అయిల్ ఫాం సాగయ్యేలా అధికారులు పని చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. అయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆపీసర్లు ఫీల్డ్ విజిట్ చేయకపోవడం, రైతులకు సలహాలివ్వక పోవడంతో పంట దెబ్బతింటుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్లు ప్రతి 15రోజులకు ఒకసారి రైతులను కలిసి పంటను పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వాలన్నారు.

లేకపోతే పంట నష్ట పరిహారం ఫీల్డ్ ఆఫీసర్ల జీతం నుంచి తీసుకుంటాం.. లేదా ఫీల్డ్ ఆఫీసర్లను ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని మంత్రి మదలించారు. అనంతరం బదిలీపై వెళ్లుతున్న జిల్లా హార్టికల్చర్ అధికారి రామలక్ష్మిని మంత్రి హరీష్ రావు ఘనంగా సత్కరించారు. సమీక్షలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, సతీష్ కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమిషనర్ శ్వేత, జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖాధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed