విహార యాత్రా..? బుజ్జగించేందుకా..?

by Disha Web Desk 22 |
విహార యాత్రా..? బుజ్జగించేందుకా..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ల గోవా విహారయాత్ర అంశం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. విహార యాత్రా..? లేక అసంతృప్తి కౌన్సిలర్లను బుజ్జగించేందుకా..? అని సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 43 వార్డులు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 36 మంది కౌన్సిలర్లు, 5గురు ఇండిపెండెంట్లు, ఎమ్‌ఐ‌ఎమ్, బీజేపీ తరుపున ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ వచ్చింది. మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ ( మహిళ ) రిజర్వ్ కావడంతో అంతకు ముందు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన కడవేర్గు రాజనర్సు సతీమణి కడవేర్గు మంజుల రాజనర్సును మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండిపెండెంట్లుగా గెలిచిన కౌన్సిలర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరిన నాటి నుంచి చైర్ పర్సన్ కొంత మంది కౌన్సిల్ సభ్యులు మధ్య కోల్డ్ ఉన్నప్పటికి జిల్లాలోని బీఆర్ఎస్ కీలక నేత ఆశీస్సులు మున్సిపల్ చైర్ పర్సన్‌కు ఉండటంతో అసంతృప్తి బయటపెట్టే ప్రయత్నం చేయలేకపోయారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో మున్సిపల్ చైర్మన్ భర్త వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనవరిలో హైదరాబాద్‌లో సమావేశం కావడంతో కౌన్సిల్ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలైనట్లైంది.

అప్పట్లో ఈ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకొని సదరు అసంతృప్త కౌన్సిలర్లకు నచ్చచెప్పడంతో ఆ అంశం సద్దుమణిగింది. కానీ హైదరాబాద్‌లో సమావేశమైన కొందరు కౌన్సిలర్లు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. సదరు కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా మార్చి 24 నుంచి 28 వరకు 18 మంది కౌన్సిలర్లు గోవా టూర్ అంశం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ల విహారయాత్ర అంశం వారి వారి వ్యక్తిగత ఏమైనప్పటికీ...గత కొంతకాలంగా సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అలకలు… బుజ్జగింపులు నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులు పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. కౌన్సిలర్ల గోవా టూర్ కేవలం విహారయాత్ర అయితే ఓకే.. లేదంటే పార్లమెంట్ ఎన్నికల ముంగిట కౌన్సిల్‌లో ముసలం అయితే..కారు కంచుకోటలో గులాబీ పార్టీకి కాస్త గడ్డుకాలమేనని చెప్పక తప్పదు.

కాంగ్రెస్ గూటికి 8 మంది కౌన్సిలర్లు..?

కాంగ్రెస్ పార్టీ గూటి సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 కౌన్సిలర్లు చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం కొంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును ఇండిపెండెంట్‌గా గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కౌన్సిలర్ కుమారుడు కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే బాటలో మరికొంత మంది కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed

    null