అభివృద్ధి కే పటాన్ చెరు ప్రజలు అందలం

by Disha Web Desk 15 |
అభివృద్ధి కే పటాన్ చెరు ప్రజలు అందలం
X

దిశ,పటాన్ చెరు : గత పదేండ్లలో పటాన్ చెరు నియోజకవర్గం మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దామని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అందలం వేస్తారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. రేపు గణేష్ గడ్డలోని సిద్ధి గణపతి దేవాలయ ప్రాంగణంలో ప్రచార రథాలకు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ఈ నెల 13న జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రచార పర్వంలో అవలంబించాల్సిన విషయాలపై చర్చిస్తామన్నారు. 15 న జిన్నారం, గుమ్మడిదల, 16న పటాన్ చెరు డివిజన్ తో పాటు మండలం, 18 న ఆర్సిపురం, భారతి నగర్ డివిజన్ లలో, 19 బొల్లారం, తెల్లపూర్ మున్సిపాలిటీ లలో, 20 న అమీన్ పూర్ మండలంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సలహాలు సూచనలకు అనుగుణంగా నెల రోజుల పాటు ప్రణాళిక బద్ధంగా ప్రచారాన్ని నిర్వహించి మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ గెలుపులో భాగస్వాములం అవుతామని తేల్చి చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీని కట్టబెడుతామని ధీమా వ్యక్తం చేశారు.

చేసిన అభివృద్ధే మా నినాదం..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో వేలాది కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్యే గూడెం చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన విధులతో పాటు సొంత నిధులను సైతం వెచ్చించి ప్రజల అవసరాలను తీర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. గత పదేండ్లలో తాను చేసిన అభివృద్ధి

పనులు సంక్షేమ కార్యక్రమాల వల్ల ముచ్చటగా మూడోసారి ప్రజల విశ్వాసం పొంది అసెంబ్లీ ఎన్నికల్లో తాను విజయం సాధించానని తేల్చి చెప్తున్నారు. మినీ ఇండియా లాంటి పటాన్ చెరు నియోజకవర్గ ఓటర్లు చాలా చైతన్యవంతులని కండ్ల ముందు జరిగిన అభివృద్ధి, కేసీఆర్ ప్రభుత్వంలో అందిన సంక్షేమాన్ని గుర్తిస్తారని నమ్మకంతో ఉన్నారు. తాము చేసిన అభివృద్ధి నినాదంగా విరివిగా ప్రజల్లోకి వెళ్లి పకడ్బందీగా ప్రచారాన్ని నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీ ని కట్టబెడుతారని వెల్లడించారు.

చెక్కుచెదరని క్యాడర్ అదనపు బలం...

పటాన్ చెరు నియోజకవర్గంలో చెక్కుచెదరని క్యాడర్ తమకు అదనపు బలమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. గత పదేండ్లలో నిరంతరం క్యాడర్కు అందుబాటులో ఉంటూ వారి సాధకబాధకాలను తీరుస్తూ అండగా నిలబడ్డానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను నిర్వహించిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ క్యాడర్ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే తాను ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించినట్టు వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పైన సంపూర్ణ విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అత్యధిక మెజార్టీ కట్టబెట్టే విధంగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా సమాయత్తం అవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ క్యాడరంతా సమన్వయంతో పనిచేసి ముచ్చటగా మూడోసారి మెదక్ పార్లమెంటులో హ్యాట్రిక్ విజయం కట్టబెడతామని ధీమాతో ఉన్నారు. ఈ రాబోయే నెల రోజులు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా పని చేసి ప్రజల్లోకి వెళ్లి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మెదక్ పార్లమెంట్ గెలుపునకు సహకరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed