ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ రాజార్షిషా

by Disha Web Desk 15 |
ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ రాజార్షిషా
X

దిశ, పాపన్నపేట : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పనులు తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజార్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ రమేష్, ఆర్డిఓ సాయిరాం, ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా సంబంధిత అధికారులతో జాతర ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10న ట్రయల్ గా ఘనాపూర్ ఆయకట్టు నుండి నీటిని వదలాలని, తిరిగి జాతరకు 15న నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. నీరు కలుషితం కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి ఆలయం వరకు ఉచితంగా మినీ బస్సులు, ఆటోల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. పోతన శెట్టిపల్లి వైపు బస్టాండ్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు షామియానాలు, తాగునీరు, మరుగుదొడ్లు, బారీకేడ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోతంశెట్టిపల్లి వద్ద ట్రాఫిక్ నియంత్ర, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

చెలిమిలకుంట వద్ద రోడ్డుకు ఇరుపక్కలా వాహనాల పార్కింగ్ వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ వాహనాలను జాతరలోనికి అనుమతించవద్దని, వీఐపీ వాహనాలను, ప్రత్యేక వాహనాల పాసులను కేటాయించాలని సూచించారు. మూడు బ్రిడ్జిల వద్ద గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఐదు ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పారబోసిన చెత్తను తరలించే విధంగా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు . వీరికి ఆలయ పాలకమండలి చైర్మన్ బాలా గౌడ్, ఈవో శ్రీనివాస్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుల శాఖ ఈ ఈ శ్రీనివాస్, డీపీఓ సాయిబాబా, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈ ఈ పాండురంగారెడ్డి, మిషన్ భగీరథ అధికారి కమలాకర్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు రజిని, డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed