పటాన్​చెరువులో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతే : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Disha Web Desk 15 |
పటాన్​చెరువులో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతే : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, అమీన్ పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్​చెరువు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు కుటుంబాలతో సహా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల పార్టీల అడ్రస్ గల్లంతు కానుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఆర్టీసీ స్వర్ణపురి కాలనీలో స్థానిక కౌన్సిలర్ మహాదేవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 300 మంది కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవపురి హిల్స్ మీదుగా హెచ్ఎంటీ కాలనీ, పీజేఆర్ కాలనీల మీదుగా స్వర్ణపురి కాలనీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలతో పాటు ఐటీ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చేయూతను అందించాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అనుసరిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. స్వర్ణపురి కాలనీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు.

పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అనంతరం కాలనీలో 1600 గజాలలో 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పార్టీలో చేరిన వారిలో సువర్ణ వ్యాలీ కాలనీ రెసిడెన్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, మాధవపురి హిల్స్ కాలనీ, జనప్రియ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed