ఇలా పాలించడం మీ వల్ల అవుతుందా?.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ సూటి ప్రశ్న

by Disha Web Desk 2 |
ఇలా పాలించడం మీ వల్ల అవుతుందా?.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగిందని భారత కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్తకుప్పలో విసిరేశారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తుందనో, పూర్తిగా మేనిఫెస్టో అమలు చేస్తుందనో వారికి ఓట్లు వేసి గెలిపించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన దోపిడీ కంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత ఎక్కువగా దోపిడీ జరిగిందన్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై అన్ని రంగాల్లో, అన్ని సెక్షన్ల ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన అనంతరం ప్రజలే పాలకులు, మేము సేవకులం అంటూ మాట్లాడారని గుర్తుచేశారు. ప్రజలే పాలకులు అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యం గురించి అడుగుదామన్నారు. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమతుందా? జైళ్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న రాజకీయ ఖైధీలను విడుదల చేయమని ప్రజల కోరుతున్నారన్నారు. విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. అర్బన్ నక్సలైట్లు, మావోయిస్టులంటూ ముద్ర వేస్తూ వారిని అక్రమ కేసుల్లో ఇరికించిన ఊపా చట్టం, ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి.. వాటిని నిలిపివేయండి. వారిపై అక్రమ కేసులు కొట్టివేయండి.

ధర్నా చౌక్‌ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్ధరించండి. పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని కనీసం చట్టబద్ధ పాలన కొనసాగించమని ప్రజలు కోరుతున్నారన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి, రాష్ట్రంలో మిగులు భూములను, ప్రభుత్వ బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలని, ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్మికుల వేతనాలు, క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.



Next Story