కొత్త సచివాలయంలో ఖాళీగా కూర్చుంటున్న అధికారులు.. ఎందుకంటే?

by Disha Web Desk 2 |
కొత్త సచివాలయంలో ఖాళీగా కూర్చుంటున్న అధికారులు.. ఎందుకంటే?
X

నూతన సచివాలయంలో అన్నిశాఖల అధికారులు, సిబ్బంది విధులు పూర్తి స్థాయిలో నిర్వర్తించాలంటే మరోవారం రోజులు గడువు పట్టనుంది. సచివాలయం ప్రారంభం రోజు నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టినప్పటికీ సాధ్యం కాలేదు. కంప్యూటర్లను ఏర్పాటు చేసినా సాకెట్లు, డేటాను పొందుపర్చలేదు. ఇంకా కొన్ని శాఖలకు చెందిన ఫైళ్లు సైతం రాలేదని సమాచారం. అధికారులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చినా ఖాళీగా కూర్చోవడమేనని ఉద్యోగులే అభిప్రాయపడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజు నుంచే అన్నిశాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తారని ప్రభుత్వం స్పష్ఠం చేసింది. అందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్కేఆర్ భవన్ నుంచి శాఖలకు సంబంధించిన పైళ్లను నూతన సచివాలయానికి తరలించేందుకు మూడ్రోజులు గడువు విధించింది. ఏ సమయంలో ఏశాఖలను తరలించాలని ప్రభుత్వం ఆధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏ శాఖ ఏ ఫ్లోర్ లో ఉండాలని కూడా సూచించింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు సరిపోలేదో... ఆయా శాఖలకు కేటాయించిన ఫ్లోర్లలో మౌలిక సదుపాయాలు కల్పించలేదో తెలియదు కానీ కొన్నిశాఖలకు చెందిన ఫైళ్లు, డేటాను పూర్తిస్థాయిలో తరలించలేదని సమాచారం. కంప్యూటర్లకు సంబంధించిన సాకెట్లను కూడా పూర్తిస్థాయిలో అమర్చలేదని తెలిసింది. కంప్యూటర్లను అమర్చినా అందుకు సంబంధించిన పరికరాలను, ఇంటర్నెట్ సౌకర్యం సైతం కల్పించలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అన్నిశాఖలు పూర్తిస్థాయిలో విధులు ప్రారంభించాలంటే మరోవారం రోజుల సమయంపట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ఆఫీసుకొచ్చినా...

అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని.. ఒక్కోశాఖ ఒక్కో దగ్గర ఉంటే అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రభుత్వం సమీకృత సచివాలయాన్ని నిర్మించింది. అన్నిశాఖల తరలింపును మూడ్రోజుల్లో కంప్లీట్ చేయాలని భావించింది. ప్రభుత్వం సైతం అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆదేశాల మేరకే అన్నిశాఖల అధికారులు నూతన సచివాలయానికి వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో వనరులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, సిబ్బంది వచ్చినా ఆయాశాఖల్లో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో వచ్చి ఖాళీగా కూర్చొని వెళ్తున్నారని ఉద్యోగులే చెబుతున్నారు.

పైళ్లు పెండింగ్...

పూర్తిస్థాయిలో అన్ని శాఖలకు చెందిన పైళ్లు, కంప్యూటర్లను అమర్చలేదు. దీంతో పరిపాలన వారం రోజులపాటుస్తంభించనుంది. పైళ్లు మొత్తం పెండింగ్‌లోనే పడనున్నాయి. ప్రజలు తమ ఆర్జిలకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన వారికి ఆశాభంగమే మిగలనుంది. కొన్ని అర్జెంట్ ఫైళ్లు సైతం పెండింగ్ కే పరిమితం కానున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లోని మౌలిక వసతులు కంప్లీట్ చేసి ప్రజల ఆర్జీలకు, పెండింగ్ పైళ్లకు మోక్షం కలిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Read more:

TS Secretariat :సెక్రటేరియట్‌ వద్ద సెక్యూరిటీ అత్యుత్సాహం.. అధికారులు, ఎంప్లాయీస్‌లో అసహనం!

Next Story

Most Viewed