చైనాలో పుతిన్ పర్యటన..ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం

by samatah |
చైనాలో పుతిన్ పర్యటన..ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం చైనాకు చేరుకున్నారు. పుతిన్‌కు చైనాలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పాటు పుతిన్ డ్రాగన్ పర్యటనలో ఉండనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఈ పర్యటన రెండు అత్యంత శక్తివంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని రష్యా భావిస్తోంది. అంతేగాక ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తు్న్న తమకు మద్దతివ్వాలంటూ ఇటీవల రష్యా చైనాను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పుతిన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. రష్యాతో చారిత్రక సంబంధాలున్న ఈశాన్య చైనాలోని హర్బిన్‌ను కూడా పుతిన్ సందర్శించనున్నారు. దాదాపు 80 మంది రష్యన్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మాల్‌ను పుతిన్ ప్రారంభించనున్నట్టు సమాచారం.

మరోవైపు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నూతనంగా మరోసారి ఎన్నికన తర్వాత ఇదే తొలి విదేశీ అధికారిక పర్యటన కావడం గమనార్హం. అయితే చైనా పర్యటనకు ముందు పుతిన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌లో వివాదంపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే అన్ని దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. చర్చలకు ఎప్పడూ నిరాకరించలేదని తెలిపారు. దీంతో మరోసారి తమకు అండగా ఉండాలని చైనాను పుతిన్ కోరనున్నట్టు తెలుస్తోంది.

కాగా, 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి రష్యా ఆర్థికంగా చైనా మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయి. తాజా పర్యటనతో ఈ బంధం మరింత బలపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ పై దాడికి ముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించడం విశేషం.

Advertisement

Next Story