మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులను చేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

వ్యాపార రంగంలో మహిళలను విజయవంతమైన వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులను చేస్తాం :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వ్యాపార రంగంలో మహిళలను విజయవంతమైన వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళా ఆర్థిక సాధికారత కోసం 'మహిళా శక్తి మార్కెట్లు' ఏర్పాటు చేసి, మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములు, షేర్ హోల్డర్లుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ సూపర్ మార్కెట్లను మహిళలే నిర్వహిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారని, ఈ అవకాశాల ద్వారా లక్షలాది మహిళలకు ఉపాధి, గౌరవం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


ఇంతవరకే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, పెట్రోల్ పంపులు, ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, అలాగే మహిళా సమాఖ్యల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ కి అద్దెకు ఇవ్వడం లాంటి అనేక ఆర్థిక సౌలభ్యాలను కల్పించినట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్లతో మహిళలకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆయన అన్నారు. అనంతరం మహిళలు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, మహిళా సంఘాలు, సమాఖ్య సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story