మక్తల్ వ్యవసాయ మార్కెట్ స్థలం సర్వే.. కొలిక్కి వస్తున్న వివాదం..

by Disha web |
మక్తల్ వ్యవసాయ మార్కెట్ స్థలం సర్వే.. కొలిక్కి వస్తున్న వివాదం..
X

దిశ, మక్తల్: బుధవారం మక్తల్ వ్యవసాయ మార్కెట్ భూమిని అధికారులు సర్వే నిర్వహించారు. మేం అమ్మిన దాని కన్నా దాదాపు ఎకరం నరా భూమిని వ్యవసాయ మార్కెట్ వాళ్లు అక్రమంగా ఆక్రమించుకున్నారని అబ్దుల్ రెహమాని వారసులు మిగులు భూమిని ఇవ్వాలని 40 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న క్రమంలో బుధవారం సర్వే జరిగింది. సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.

1954, 1955 లలో మక్తల్ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని, నాటి గ్రామ వ్యాపారస్తులు సర్వే నెంబర్ 44 లో వ్యవసాయ భూమిని అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి నుంచి ఎకరం రూ. 200 చొప్పున పది ఎకరాలను మార్కెట్ వాళ్లు కొనుగోలు చేసినట్లుగా భూమి హక్కు పట్టాదారుల వారసులు చెబుతున్నారు. తమ భూమిని మక్తల్ వ్యవసాయ మార్కెట్ వాళ్లు ఆక్రమించుకున్నారని,1983, 1984 లలో పట్టాదారుడు సర్వే చేయించగా ఎకరం 18 గుంటల భూమిని అక్రమించుకున్నారని తేలింది. ఆ సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించగా అదనంగా ఆక్రమించుకున్న భూమిని పట్టాదారికి ఇవ్వాలని నారాయణపేట కోర్టు తీర్పు ఇచ్చింది.

కోర్టు ఉత్తర్వులను మార్కెట్ అధికారులు లెక్క చేయక పోవడంతో అబ్దుల్ రెహమాన్ వారసులు 2001, 2002లలో, 2017, 2018 లలో సర్వేలు నిర్వహించగా 28 గుంటల భూమి ఎక్సైస్ గా తేలింది. ఈ విషయాన్ని కోర్టు ధ్రువీకరించి పట్టాదారి వారసులకు భూమి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్నీ కూడా లెక్క చేయకుండా మార్కెట్ కి ఉత్తరం వైపు ఉన్న సంగం బండ రోడ్డు గుండా అప్పటి మార్కెట్ కమిటీ 2018లో దాదాపు నలబై దుకాణాలు నిర్మించారు. ఆ దుకాణాలను కిరాయికి ఇచ్చి మార్కెట్ కు ఆదాయాన్ని సమకూర్చుదామని టెండర్లను కాల్ ఫర్ చేయగా తన భూవివాదం తేలందే దుకాణాలను ప్రారంభించేది లేదని పట్టాదారుడు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్ పాలకమండలి లేకపోవడంతో, మార్కెట్ సెక్రెటరీ అశ్వక్ మహమ్మద్ సెక్రెటరీ చొరవ తీసుకొని సర్వే నిర్వహించారు.

కాగా ఓ అధికారి మాట్లాడుతూ ప్రకారం1954 సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి లేకపోవడంతో అప్పట్లో మార్కెట్ ఏర్పాటు చేయడానికి గాను మక్తల్ గ్రామపంచాయతీకి అబ్దుల్ రెహమాన్ రిజిస్ట్రేషన్ చేశాడని, వివాదాన్ని గ్రామపంచాయతీతో తేల్చుకోవాల్సి ఉండగా మార్కెట్ పై కేసు వేయడం సబబు కాదని అన్నారు. బుధవారం జరిగిన సర్వే ప్రకారం వ్యవసాయ మార్కెట్ ఎక్సెస్ భూమిని ఉందని తేలితే దాన్ని చట్ట ప్రకారం గ్రామపంచాయతీకి అప్ప చెబుతామని పట్టాదారునికి ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదని ఆయన తెలిపారు. ప్రస్తుతం మక్తల్ వ్యవసాయ మార్కెట్ ఏరియాలో గజం రూ. 30వేలు పలుకుతుండగా ఈ స్థలంపై ఆశలు పెట్టుకున్న వారసులు సర్వే రిపోర్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


Next Story