అతివేగమే ప్రమాదాలకు కారణం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

అతి వేగంగా వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నవని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కో-ఆర్డినేషన్ కమిటీ ద్వారా ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

అతివేగమే ప్రమాదాలకు కారణం :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అతి వేగంగా వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నవని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కో-ఆర్డినేషన్ కమిటీ ద్వారా ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎన్ఐసీ విడియో కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన జిల్లా ఎస్పీ జానకి, నగరపాలక మేయర్ మమత తో కలిసి మాట్లాడారు. ప్రధాన రహదారులపై అనుమతి లేకుండా మీడియన్ల ను తెరవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. పాలకొండ బైపాస్ రోడ్, భూత్పూర్ నుంచి వన్‌ టౌన్ వరకు, హన్వాడ నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు కొత్తగా నిర్మించిన రహదారులపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. సంబంధిత శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని, అనుమతి లేని మీడియన్ ఓపెనింగ్‌ లను మూసివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.


పట్టణానికి అనుసంధానమైన ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డు లు, వేగపరిమితి సూచికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భారీ వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 200 సీసీటీవీ కెమెరాలకు అదనంగా మరో 500 కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర నిఘా ఉంచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నాలుగు ప్రధాన రహదారులపై స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన జంక్షన్ల వద్ద తగిన లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, అవసరమైన చోట స్ట్రీట్ లైట్లు, హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ, ప్రమాదాలకు గురవుతున్న జంక్షన్‌ లను గుర్తించి అక్కడ భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియపరుస్తూ ప్రతి నెల మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీ వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సంధ్య, జాతీయ రహదారులు, రవాణా, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story