అడ్రస్ లేని ఆరు గ్యారెంటీలు : డీకే అరుణ

by Disha Web Desk 11 |
అడ్రస్ లేని ఆరు గ్యారెంటీలు : డీకే అరుణ
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారేంటీల అడ్రస్ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఛాలెంజ్ విసిరారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని పద్మావతీ కాలనీలోని కాళికాంబిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు లాంటి అర గ్యారెంటీ మాత్రమే మనకు కనిపిస్తుందని, మిగతా అయిదున్నర గ్యారెంటీల లబ్ధీదారులలో ఒక్కరినైనా తీసుకొచ్చి చూపిస్తారా అని ఆమె సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి ఆరు గ్యారెంటీలు అమలు పై చేస్తున్నది దొంగ ప్రచారమని,వంద రోజులు కాదు కదా,వెయ్యి రోజులైనా అమలు అయ్యేది లేదు అని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీసి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసి చూపెట్టారని, ఉజ్యల గ్యాస్ కనెక్షన్,సీఏఏ అమలు,చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు,'బేటి బచావో,బేటి పడావో' లాంటి ఎన్నో మహిళా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత నరేంద్ర మోడీ ది అని ఆమె వివరించారు. రాష్ట్రంలో,దేశంలో అభివృద్ధి అందలం ఎక్కాలన్నా కమలం పువ్వు గుర్తు బీజేపీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.



Next Story