పాలమూరు రైతు మృతికి పాలకులే కారకులు - డీకే అరుణ

by Disha Web Desk 11 |
పాలమూరు రైతు మృతికి పాలకులే కారకులు - డీకే అరుణ
X

దిశ ప్రతినిధి నాగర్ కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వాసిత రైతు ఆత్మహత్యకు కారకులు నేటి బీఅర్ఎస్ పాలకులేనని ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హత్యనేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పాలమూరు ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయి సరైన పరిహారం అందలేదని ఆత్మహత్యకు పాల్పడిన రైతు అనంత అల్లోజి మృతదేహానికి నివాళులర్పిస్తూ మాట్లాడారు.

ఈ ప్రాంతం బాగుపడుతుందని గొప్పగా ప్రచారం చేసిన ఈ ప్రభుత్వానికి రైతులు భూములను అప్పగిస్తే వారిని గడ్డి పూస లెక్క భావించి సరైన పరిహారం ఇవ్వకుండా వారి బతుకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తు చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రజల కోసం జరపడం లేదని జూరాల పాకాల అనే ప్రాజెక్టును డిజైన్లు పేర్లు మార్చి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కొల్లాపూర్ నియోజకవర్గం నార్లాపూర్ వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఎత్తిపోస్తున్నాడని మండిపడ్డారు.

తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కృష్ణ నీటిని వాడుకునేలా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల వద్ద తాను మంత్రిగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టినట్లు గుర్తు చేశారు. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజల సెంటిమెంటుతో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో వేల కోట్లను దోచుకుంటున్నారని చివరికి పదేళ్ల కాలంలో ఒకే మోటార్ను ప్రారంభిస్తూ అంత నిర్మించినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

పాలమూరు ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు ఆత్మహత్యలకు పాల్పడడంలో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రినని గుర్తు చేశారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తాల్లోజు ఆచారి మాట్లాడుతూ నిర్వాసిత రైతు కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తేనే అంత్యక్రియలు జరుగుతాయని లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం కుమ్మెర గ్రామం నుండే మొదలయిందని అన్నారు.

ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల వల్లే ముదిరాజ్ బిడ్డ అనే కక్షతోనే తాను పొర్లుదండాలు పెట్టినా కనికరించలేదని, ప్రాజెక్టు మేనేజర్ తనను హెచ్చరించాడని చెప్పిన పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐదు ఎకరాలే అవసరం ఉంటే మిగతా 14 ఎకరాలు ఎవరి కోసం గుంజుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు జవానుల మధ్య ఉన్న మీకు జనాల మధ్యకు వస్తే జనం గోస తెలుస్తుందని మండిపడ్డారు. వారితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎల్నేని సుధాకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మన్నెమ్మ, దిలీప్ చారి, పార్లమెంటు కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story