మిల్లర్లతో అధికారుల మిలాఖత్.. తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం

by Disha Web Desk 12 |
మిల్లర్లతో అధికారుల మిలాఖత్.. తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం
X

దిశ ప్రతినిధి నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. సాగు మొదలు.. పంటను ప్రభుత్వానికి అమ్ముకొని డబ్బులు చేతికి వచ్చేదాకా నరకం కనిపిస్తోందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి గింజ వరకు తడిసిన ధాన్యమైన కొంటామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రగల్భాలు పలకడమే తప్పితే క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోందని వారు మండిపడుతున్నారు. మిల్లర్లు, అధికారులు తెరవెనక మిలాఖత్ అయి తమ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆయా మిల్లులకు లారీల ద్వారా పంపిన సదరు మిల్లు యాజమాన్యాలు లారీలోని ధాన్యాన్ని మళ్లీ తేమ శాతం, తాలు శాతాన్ని పరీక్షిస్తున్నారు. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఒక్కో గింజను పట్టి మరీ తాలు లెక్కలేస్తున్నారు.

చివరికి చిన్నపాటి బియ్యం తీసే యంత్రాన్ని రైతుల ముందు పెట్టి బియ్యం శాతం ఎంత వస్తుందో లెక్కలు కట్టి రైతులను నట్టేట ముంచుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నప్పటికీ ప్రస్తుతం పండిన ధాన్యం నూక ఏర్పడుతుందని రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఒక్కో సంచి మీద సుమారు నాలుగు కిలోలు తరుగు తీయాల్సి వస్తుందని లేదంటే వడ్లను తిరిగి తీసుకెళ్లాలని చెప్పడంతో రైతులు ఎటు తేల్చుకోలేక మిల్లు యజమానులకు లొంగిపోయి అమ్ముకుంటున్నారు. ఇదేంటని అడిగిన రైతులకు మాత్రం కంటి తుడుపుగా రైస్ మిల్లు కేంద్రాలను పరిశీలించి మరోసారి ఇలా చేయొద్దంటూ రైతుల ముందు హెచ్చరించినట్లు నాటకమాడి షరా మామూలుగా వదిలేస్తున్నారు. ఫలితంగా ఒక్కో రైతు వేల రూపాయలను నష్టపోతున్నాడు.

ఆత్మీయ సమ్మేళనాలకు సహకరించిన రైస్ మిల్లులు.!

బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు జిల్లాలోని ఆయా రైస్ మిల్లు యజమానులు సహకరించడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రస్తుతం రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో కోతలు విధిస్తూ సరి చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైస్ మిల్లు స్థలాల్లో గత నెల క్రితం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తమ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అందుకు మరికొన్ని రైస్ మిల్లు యజమానులు సంపూర్ణ సహకారం అందించారని వినికిడి. ఈ నేపథ్యంలోనే రైస్ మిల్ ఓనర్స్ రైతుల నుంచి అడ్డగోలుగా తేమ, తాలు పేరుతో దోపిడీకి పాల్పడినప్పటికీ సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిడికి లోనై రైస్ మిల్లు ఓనర్లకే అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అకాల వర్షంతో మరింత నష్టం

మరో రెండు రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ సంబంధిత అధికారులు మేల్కోక పోవడంతో రైతులు ధాన్యం కొనుగోలు జరగక కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. సుమారు జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు ఆ దిశగా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోపక్క అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ధాన్యాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణం. దీంతోపాటు కొనుగోలు ప్రక్రియ పూర్తయిన సకాలంలో తమ అకౌంట్లో డబ్బులు జమ కావడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతలు విధించకుండా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి త్వరితగతిన డబ్బులు తమ అకౌంట్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed