24 గంటల్లో రూ.1.89 కోట్ల నగదు స్వాధీనం.. భారీగా పట్టుబడుతున్న నగదు

by Disha Web Desk 1 |
24 గంటల్లో రూ.1.89 కోట్ల నగదు స్వాధీనం.. భారీగా పట్టుబడుతున్న నగదు
X

దిశ, సిటీ బ్యూరో: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నందున లెక్క పత్రాలు లేకుండా తరలిస్తున్న జప్తునకు గురవుతున్న నగదు కేసులు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.1.89 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. మరో రూ.4.32 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,797 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.21,57 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా.. రూ.13,76 కోట్ల విలువైన వస్తువులను వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పట్టుకుని సీజ్ చేశాయని, ఇప్పటి వరకు మొత్తం 26,416 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 261 కేసులు నమోదు చేసి, 258 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ.5.71 కోట్ల విలువైన వస్తువులు పట్టుకున్నట్లు తెలిపారు. పోలీస్ అథారిటీ, ఐటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రూ.15.59 కోట్ల నగదును, రూ.12.25 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు నగదు, ఇతర వస్తువులపై 551 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు. 354 మందిపై ఎఫ్ఐ‌ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 3,068 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు రోనాల్డ్ రోస్ తెలిపారు.

Next Story

Most Viewed