బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్

by Aamani |
బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి, ఉట్కూర్ : చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యల పై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బేటి పడావో - బేటీ బచావో, బచ్ పన్ బచావో ఆందోళన్, బాల్యవివాహాల నిర్మూలన పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే మండలాలను గురించి ఆయా ప్రాంతాలలో బాల్యవివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి బాల్యవివాహాలు తగ్గినా, ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు అవగాహన రాహిత్యంతో తమ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, జిల్లాలో 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల వివరాలను సేకరించి శిక్షణ కార్యక్రమంలో నిర్వహించాలన్నారు. డి డబ్ల్యు ఓ నరసింహారావు, డీఈవో అబ్దుల్ ఘని, జి సి డి ఓ పద్మ నళిని తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ యూనిఫామ్ స్టిచింగ్ పరిశీలన..

ఉట్కూరు మండల కేంద్రంలో ఆ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా స్వశక్తి స్కూల్ యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్ యూనిఫామ్ క్లాత్ కటింగ్, యూనిఫాం తయారీని చూశారు. రోజుకు ఒక మహిళా టైలర్ ఎన్ని జతల స్కూల్ యూనిఫామ్ లను కుట్టు కలుగుతుందని అడిగి తెలుసుకున్నారు. ఒక జత యూనిఫాం కుట్టడానికి ఎంత సమయం పడుతుందని స్వయంగా టైలర్ల తోనే కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. ఆ కేంద్రంలో మొత్తం 20 మంది మహిళా టైలర్లు రోజుకు కుడుతున్న యూనిఫాంలను ఎక్కడ నిల్వ చేస్తున్నారని అడిగారు.యూనిఫాం లను ఇంకా తొందరగా కుట్టేందుకు కృషి చేయాలని టైలర్లను కోరారు. డి ఆర్ డి ఓ రాజేశ్వరి, అడిషనల్ డిఆర్డిఓ అంజయ్య, ఏపీ ఏం ఇందిరా, మండల మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed