జర్నలిస్ట్ ముసుగులో నిరుపేదలకు గోల్డ్ ఎగవేత..!

by Disha Web Desk 11 |
జర్నలిస్ట్ ముసుగులో నిరుపేదలకు గోల్డ్ ఎగవేత..!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ కంపెనీలో జరిగే మోసాల నుంచి బయట పడేందుకు సదరు బ్యాంకు మేనేజర్ ఓ పత్రికలో పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డు సృష్టించి జర్నలిస్టు పేరుతో బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు బయటపడింది. మోసపోయిన బాధితుల పక్షాన దిశ దినపత్రికలో గురువారం ‘నిరుపేదలపై కుచ్చు టోపీ’ అనే కథనాన్ని రాసిన జర్నలిస్టు పైనే గురువారం సదరు బ్యాంక్ మేనేజర్ చిందులు వేస్తూ బెదిరింపులకు దిగాడు.

తనను ఎవరు ఏమి చేయలేరని చేతనైతే కోర్టుకు వెళ్లొచ్చు అంటూ బాధితులకు కూడా అహంకారపూరితంగా సమాధానం ఇచ్చాడు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని చెబుతూ దానికోసం అడిగిన ప్రతివాడికీ జవాబు చెప్పుకుంటూ పోతే పనులు చేసుకోలేమని చులకనగా సమాధానం ఇవ్వడాన్ని చూస్తే గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలో ఎంతటి దోపిడీలు జరుగుతున్నాయోనని సామాన్యుల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఆకర్షణీయమైన కరపత్రాలు, తక్కువ వడ్డీ పేరుతో బురిడీ..!

జిల్లాలో నాగర్ కర్నూల్ కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లా రోజుకొకటి కొత్తకొత్త పేర్లతో వెలుస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహిస్తూ ఆకర్షనీయమైన కరపత్రాలు పంచుతూ తక్కువ వడ్డీతో బంగారు రుణాలు అంటూ ప్రచారం చేసి తీరా అవసరాల కోసం రుణాలు పొందిన బాధితులకు అనేక షరతులు విధించి వారిని బురిడీ కొట్టించడం సర్వసాధారణంగా మారుతోంది. ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న షరతులతో కూడిన ఆమోద పత్రాలపై చదువురాని వారితో సంతకాలు చేయించుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ డబ్బులను జమ చేస్తూ చివరికి బంగారం ధరకు సమానం చూపిస్తూ వేలం వేసినట్లు చావు కబురు చల్లగా చెప్పినట్లు బాధితులను నిండా మంచుతున్నారు.

మొదటి, రెండవ, మూడు విడతల వారీగా బాధితులకు నోటీసులు అందించాలని నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి స్పందించలేదని చెబుతూ బంగారాన్ని తమ వశం చేసుకుంటున్నారు. ఇలా ఎంతోమందికి జరుగుతున్నా బాధితులను బెదిరింపులకు గురిచేసి ఇలాంటి ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ బ్యాంకులు తెరవెనుక గోల్డ్ దందా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు కూడా భారీగా పెరగడంతో అమాయకులను ఆసరాగా చేసుకుని ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు ఈ విధమైన దోపిడీకి తెగబడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై పూర్తి విచారణ జరిపి ఇలాంటి ప్రైవేటు గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ బ్యాంకులపై తనిఖీలు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed