సర్వేలన్నీ బీఆర్ఎస్ కే పట్టం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Kalyani |
సర్వేలన్నీ బీఆర్ఎస్ కే పట్టం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడుతున్నట్లు కాంగ్రెస్, బీజేపీ నిర్వహించిన సర్వేలో తేలినట్లు, సర్వేలతో ఆ రెండు పార్టీలు సహనం కోల్పోయి అసహనంతో వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రం ఏనుగొండలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు.

తెలంగాణ రాకుంటే వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు అమలయ్యేవా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు పరచడం లేదని అన్నారు. 70 ఏళ్ళు పరిపాలించిన పార్టీలు కనీసం తాగునీటిని అందించ లేకపోయారని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనవచ్చేమో కానీ, కేసీఆర్ సీఎం ఉన్నంత వరకు తెలంగాణలో సాధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు.

పార్టీలో క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని, పదవులు వాటి అంతట అవే వెతుక్కుంటూ వస్తాయని, ఇందుకు మూడా చైర్మన్ గంజి వెంకన్న చక్కని ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, శాంతన్న, రహమాన్, వెంకటయ్య, గిరిధర్ రెడ్డి, ఎంపీపీలు సుధాశ్రీ, బాలరాజు, వెంకటేశ్వరమ్మ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed