ముదిరాజులందరూ అభివృద్ధి వైపు నడవాలి : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
ముదిరాజులందరూ అభివృద్ధి వైపు నడవాలి : వంశీచంద్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల : గత ప్రభుత్వ పాలనలో కులవృత్తి పేరు మీద సామాజిక దోపిడీ చేశారని, కేసీఆర్ ఒకపక్క కులాన్ని గుర్తించి మరో పక్క కులాల వారిగా రాష్ట్రంలో సంపదను కొల్లగొట్టారని, అలాంటి వారిని నమ్మకుండా ముదిరాజులందరూ అభివృద్ధి వైపు నడవాలని సిడబ్ల్యుసి మెంబర్ మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని చంద్ర గార్డెన్స్ లో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, శాప్ చైర్మన్ శివసేనా రెడ్డిలతో కలిసి ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, శివసేనా రెడ్డిలకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ముదిరాజుల ను ఉద్దేశించి వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ. ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయరంగాలలో అభ్యున్నతి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వ పాలనలో కుల వృత్తి పేరు మీద సామాజిక దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. బిజెపి పార్టీ వల్ల దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిపోవడం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్ల పరిస్థితి ఏమవుతుందో ప్రజలందరూ గమనించాలని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి ప్రజా సంక్షేమాన్ని సాధించుకోవాలని ఆయన తెలిపారు. ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ముదిరాజు బిడ్డల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైనముద్ర వేస్తూ ప్రజా పాలనలో బీసీ-డి నుండి బిసి-ఎ గా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.

మహబూబ్నగర్లో బిజెపి బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, బీఆర్ఎస్ నాయకులు బిజెపికి ఓటు వేయమని ఓటర్లకు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం శిక్ష నుండి తప్పించుకున్నందుకే నీచ రాజకీయాలకు బీఆర్ఎస్ నాయకులు తెరలేపారని అన్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని తనను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే ముదిరాజు అభ్యున్నతి కోసం పార్లమెంటు వేదికగా మీ వాణిని బలంగా వినిపించి అభివృద్ధి వైపు నడిపించే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఎన్ పి వెంకటేష్, దుష్యంత్ రెడ్డి, దత్తాత్రేయ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్ ,గోనెల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మీనాజుద్దీన్, నాయకులు బాద్మి, శివకుమార్, మాలిక్ షాకీర్, తుంగరగు, అల్లూరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed