- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నత్తనడకన LRS దరఖాస్తుల పరిష్కారం.. రాయితీ ప్రకటించినా ముందుకు రాని జనం
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 25 శాతం రాయితీ కల్పించిన ఫీజు చెల్లించడానికి ముందుకు రావడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 25శాతం రాయితీ కల్పించిన ఫీజు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీం దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. ఫీజు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగానే రాయితీ కల్పించిన ఫీజు చెల్లించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఓ పక్క ఫీజు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించకపోవడం, మరో పక్క హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలో సాప్ట్ వేర్ సమస్యలు కొనసాగడం వంటి విషయాలు నత్తనడకన సాగడానికి ప్రధాన కారణాలని అధికారులు సైతం చెబుతున్నారు.
నెల రోజుల్లో 1,49,896 దరఖాస్తులే
రాష్ట్ర వ్యాప్తంగా 25.67 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సుమారు నిషేధిత భూములు, చెరువులు, కుంటలు, నీటి వనరులకు సంబంధించి, ఇతర సమస్యల కారణంగా 5.67 లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని తిరస్కరించినట్టేనని అధికారులు చెబుతున్నారు. 20,00,495 దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు. ఇప్పటి వరకు 5.14లక్షల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. మార్చి 31 వరకు 3,64,104 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఒక్క మార్చి నెలలోనే 3.50 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఫిబ్రవరిలో 14,104 మంది మాత్రమే చెల్లించారు. అయితే ఏప్రిల్ నెలలో 1,49,896 మంది మాత్రమే ఫీజు చెల్లించారు.
సీడీఎంఏ పరిధిలో 15 లక్షలు
పురపాలక శాఖ పరిధిలో 156 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి 15,37,159 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,48,532 దరఖాస్తులకు మాత్రమే ఫీజు ఇంటిమేషన్ లెటర్స్ జారీచేశారు. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించినట్టేనని అధికారులు చెబుతున్నారు. 3,24,296 దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించారు. 87,153 దరఖాస్తులకు అధికారులు ప్రొసిడింగ్స్ జారీచేశారు. ఇప్పటి వరకు రూ.1,169 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో 3.44 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో 64 వేల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. సాంకేతిక కారణాల రీత్యా ప్రొసిడింగ్స్ ఇవ్వడంలో హెచ్ఎండీఏ వెనకబడింది. ఇప్పటి వరకు హెచ్ఎండీఏకు రూ.189కోట్ల ఆదాయం వచ్చింది.
ప్రభుత్వానికి రూ.1,720 కోట్ల ఆదాయం
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,720 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సీడీఎంఏ పరిధిలో రూ.1,169 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో రూ.189 కోట్లు, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలో రూ.362 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 25శాతం రాయితీకి బుధవారం చివరి తేదీ కావడంతో లక్ష దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించే అవకాశముందని, వీటి ద్వారా మరో రూ.500 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు రాయితీ కల్పించడానికి ప్రభుత్వం గడువు పెంచుతుందా? లేదా? అనేది చూడాలి.






