- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక్కడ భయపడే వారెవరూ లేరు.. సర్కార్‌కు కేటీఆర్ హెచ్చరిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ను బద్నాం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ను బద్నాం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రెండు పార్టీలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఒక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్‌తోపాటు హరీశ్‌రావు స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు.
తమ పార్టీ నేత హరీశ్‌రావు చేసిన ప్రజెంటేషన్‌ను చూస్తే ప్రతి ఒక్కరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రయోజనం సులభంగా అర్థమయ్యేదని తెలిపారు. 45 లక్షల ఎకరాలకు నీరందించేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ను ఇతర దేశాల్లో ఏ నాయకుడు నాలుగేళ్లలో పూర్తి చేసి ఉంటే, ఆ దేశ చరిత్రలో వారి పేరు అజరామరంగా, శాశ్వతంగా నిలిచిపోయేదని పేర్కొన్నారు. కానీ మనదేశంలో మాత్రం రాజకీయ కుయుక్తులు, కుట్రలకు ఇంతటి ఘనమైన కాళేశ్వరం ప్రాజెక్టు పావుగా మారిందని ఆరోపించారు. తాము ఇప్పటికే ఈ అంశంలో చెప్పాల్సినదంతా స్పష్టంగా చెప్పామని.. కమిషన్ ముందు హరీశ్‌రావు పూర్తి అంశాలు వివరించారని తెలిపారు. కేసీఆర్‌ను కమిషన్ కొత్తగా అడిగేందుకు ఏమీ ఉండదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విధ్వంసకర పాలన
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధ్వంసకర పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదని.. పాలన అందించడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరూ తమ పార్టీలో లేరని హెచ్చరించారు.






