- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిండు సభలో వీడియోలు చూపించిన కేటీఆర్
నిండు సభలో వీడియోలు చూపించిన కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: పోలింగ్ కంటే ముందే రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని.. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలు తనకు రెఫరెండం కాదని చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావునగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తన పాలనపై నమ్మకం లేక.. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం కాదని చెప్పారని అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అన్న మాట స్పష్టమైనదని చెప్పారు. అంతేకాదు.. సీఎంకు దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పుకోరాలని సవాల్ విసిరారు. తాను చేసింది ఏమీ లేకపోవడంతోనే రేవంత్‌రెడ్డి అటెన్షన్.. డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఆరు గ్యారంటీలతో అందరికీ మోసం
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత 24 నెలల కాలంలో చేసిందేమీ చెప్పుకునేందుకు లేకపోవడంతోనే పాత కాలం కథలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రెండేళ్లలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదని.. సబ్బండ వర్గాలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారన్నారు. విద్యార్థులు, యువకులు, రైతన్నలు, పారిశ్రామికవేత్తలకు చేసిన మోసాన్ని చూసినందుకు రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. హైదరాబాదు నగరాన్ని అథఃపాతాళానికి తీసుకువెళ్లినందుకు నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలపై మండిపడ్డారు. గతంలోనూ ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని గుర్తు చేశారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము అడిగితే.. రేవంత్‌రెడ్డి తనకు సంబంధంలేని గత ప్రభుత్వపు కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటు వేయాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం వంటి అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపిందన్నారు. కానీ.. రేవంత్ పూర్తిగా పతనావస్థకు చేర్చారని అన్నారు.
పేదలే లక్ష్యంగా హైడ్రా కూల్చివేతలు
హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి అరాచకం చేశారని.. వేలాదిమంది పేదల ఇళ్లు కూలగొట్టిన పెద్దవాళ్ల అక్రమాల జోలికి వెళ్లలేదని కేటీఆర్ విమర్శించారు. కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రా బుల్డోజర్ పేద వాళ్ల ఇంటికి బస్తీల జోలికి రావద్దు అంటే 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు అక్రమంగా నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌లను, ఇళ్లను కేటీఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థం అయ్యేలా ఎల్ఈడీ స్క్రీన్‌లపై చూపించారు. హైడ్రా గురించి గొప్పగా చెప్పుకున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిగ్గు ఉంటే తన మంత్రుల అడ్డగోలుగా అక్రమంగా కట్టుకున్న ఈ నిర్మాణాలను తొలగించాలని సవాల్ చేశారు. హైడ్రా వలన ఒక్కరికి కూడా లాభం జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ పేరును ఎత్తే నైతిక అర్హత లేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టిన ఎన్టీఆర్ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గనుక ఎన్టీఆర్ విగ్రహాలను పెడితే ఆయన ఆత్మ ఘోషిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలను పీల్చుకుతింటున్న అరాచకానికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్‌ను తరమాల్సిన అవసరం ఉందన్నారు.






