KTR : స్వార్థం కోసం మంత్రి జూపల్లి పార్టీ మారారు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

స్వార్థం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

KTR : స్వార్థం కోసం మంత్రి జూపల్లి పార్టీ మారారు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్వార్థం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్ సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంజిత్‌తో పాటు వార్డు మెంబర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి..

మంత్రి జూపల్లి కృష్ణారావు గతేడాది ఆదిలాబాద్‌లో ‘కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందో లేదో తెలియదు, నేనూ గెలుస్తానో లేదో తెలియదు’ అని స్వయంగా చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను పొగిడిన జూపల్లి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన మంత్రి పదవిని కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారని ఆరోపించారు. అవకాశవాదంతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకుడిగా జూపల్లి కృష్ణారావును ఆయన అభివర్ణించారు.

ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు

జూపల్లి అరాచకాలను ఎదుర్కొని పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ గట్టిగా గెలిచిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనను మూడు మాటల్లో చెప్పాలంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలే తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ, హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇళ్లను కూల్చివేస్తూ, చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. చెక్‌డ్యామ్‌లు కట్టాల్సిన చోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒక్కటే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గట్టిగా పోరాడి గెలవాలని సూచించారు.

Next Story