కరోనా అంటించి చంపుతా అని వార్నింగ్.. రాధాకిషన్ రావుకు కూకట్‌పల్లి పోలీసుల షాక్

by Disha Web Desk 4 |
కరోనా అంటించి చంపుతా అని వార్నింగ్.. రాధాకిషన్ రావుకు కూకట్‌పల్లి పోలీసుల షాక్
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కూకట్ పోలీసులు షాక్ ఇచ్చారు. తాజాగా నమోదైన ప్లాట్ సెటిల్మెంట్‌లో భాగంగా సుదర్శన్‌ను బెదిరించిన కేసులో పోలీసులు ఆయనను ఏ-1 గా చేర్చారు. ఇక ఈ కేసులో విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చదువుకుని, చట్టంపై అవగాహన ఉన్నా తనను రెండు సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా చేశాడని బాధితుడు సుదర్శన్ ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకుని ఇప్పుడు ధైర్యంగా బయటికి వచ్చి కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. దీంతో రాధాకిషన్ రావు తన మాటలతో బాధితుడిని ఏ రేంజ్‌లో భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.

‘నేను చెప్పినట్టు విను.. లేదంటే నీ భాగస్వాములు చంపేస్తారు. నేను చెప్పినట్టు వినకపోతే కరోనా అంటించి చంపేస్తా... ఈ రాష్ట్రంలో నేనే బాస్.... ఏ పోలీస్‌కు చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ రాధాకిషన్ రావు బెదిరింపులకు గురి చేశాడు. ఇంకా అనేక గలీజు మాటలతో తిట్టడంతో పాటు టైర్‌తో కొట్టాడని బాధితుడు సుదర్శన్ కూకట్‌పల్లి పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు సందర్బంగా వివరించారు. సుదర్శన్‌కు తన భాగస్వాములు ఏవికె రాజు, మరో వ్యక్తి రాజుల మధ్య డబ్బుల గొడవలో రాధాకిషన్ ఎంట్రీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు అనుమతితో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ విచారణ పూర్తయినా తర్వాత కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.

Next Story

Most Viewed