ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉండేది ఇంకో 90 రోజులే.. ఆ తర్వాత ఇక అక్కడే: Kishan Reddy

by Dishafeatures2 |
ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉండేది ఇంకో 90 రోజులే.. ఆ తర్వాత ఇక అక్కడే: Kishan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉండేది మరో 90 రోజులు మాత్రమేనని, ఆ తర్వాత శాశ్వతంగా ఫాంహౌజ్ కే ఆయన్ను ప్రజలు పరిమితం చేస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీపై జరుగుతున్న ప్రచారానికి, గ్రౌండ్ లెవెల్ పరిస్థితికి చాలా తేడా ఉందన్నారు. బీఆర్ఎస్ పై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. అనేక సర్వేల్లో మంత్రులు, బీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని అని చూడకుండా మంత్ర కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు రాజకీయాలు తప్ప అబివృద్ధి చేతకాదని విమర్శలు చేశారు. రాష్ట్రంలో అబివృద్ధి పనులు ప్రారంభించేందుకు ప్రధాని వస్తే ఇంట్లో కూర్చొని హాజరు కాని ఏకైక దరిద్రపు సీఎం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ మీద పథకాలు తప్పితే అవి పేదలకు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. అవినీతి తప్ప అబివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. అన్నదే తెలంగాణ ప్రజల నినాదంగా మారిందన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే గెలిచిన వారంతా కేసీఆర్ కు అమ్ముడుపోతారని కిషన్ రెడ్డి తెలిపారు. గెలిచేది లేదనే అనేక హామీలు ఇస్తున్నారని, 6 కాదు.. 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ గెలవదని నొక్కిచెప్పారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వచ్ఛ భారత్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని కిషన్ రెడ్డి కోరారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. మార్పు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంటర్నల్ గా కలిసి ఉన్నాయని, పైకేదో కొట్లాడినట్టు నటిస్తున్నాయని చురకలంటించారు. పైగా బీజేపీపైనే బట్ట కాల్చి వేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. కొన్ని పత్రికలు వ్యక్తిగత ఎజెండాతో వ్యవహరిస్తున్నాయని, ఇంకొన్ని చానళ్లు, పత్రికలు ఉద్దేశపూర్వకంగా ఇతర పార్టీలను లేపే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిసినా ఇలా వ్యవహరించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నాయన్నారు. సొంత ఎజెండాతో పత్రికలు రాతలు రాయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలోనూ 11 మంది నాయకులు జాయిన్ అయ్యారన్నారు. ఇంకా పెద్ద మొత్తంలో పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు.

Next Story