దిక్కుమాలిన ఇందిరమ్మ పరిపాలన మనకెందుకు : సీఎం

by Disha Web Desk 15 |
దిక్కుమాలిన ఇందిరమ్మ  పరిపాలన మనకెందుకు : సీఎం
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.... ఇందిరమ్మ రాజ్యపు దిక్కుమాలిన పరిపాలన మనకెందుకు..... ఇందిరమ్మ పరిపాలనలో ఎమర్జెన్సీ ని మనం చూసినం.... అప్పట్లో ప్రతిపక్ష నాయకులను జైల్లో పడేశారు.... ఆ పాలన మనకు అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. వైరాలోని అయ్యప్ప క్షేత్రం సమీపంలో జాతీయ ప్రధాన రహదారి పక్కన మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు అని, ఆ ఓటు హక్కు ఐదు సంవత్సరాల భవిష్యత్తు తలరాతలను మారుస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొట్లాడే వారికే కత్తి ఇవ్వాలని కోరారు. కత్తి ఒకరికి ఇచ్చి మరొకరిని యుద్ధం చేయమంటే ఎలా అని ప్రజలను ప్రశ్నించారు. ధరణి వెబ్సైటును రద్దు చేస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వైకుంఠపాళీ ఆటలో పెద్ద పాము మింగినట్లే అవుతుందని చెప్పారు. ధరణి ని తొలగిస్తామని చెబుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను తుక్కుతుక్కుగా ఓడించాలని వివరించారు. ఎన్నికల్లో చిన్న పొరపాటు జరిగినా పెద్ద దెబ్బ తింటామని, ప్రజలు

జాగ్రత్త పడాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వజ్రం, బంగారం తునకలాగా తయారు చేస్తామని చెప్పారు. ఇది కేసీఆర్ కల అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్న గోదావరిపై సీతారామ లాంటి ప్రాజెక్టు నిర్మించాలని గడిచిన 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మంత్రులు ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ఇది పూర్తయితే మరో 30 నుంచి 40 వేల ఎకరాలు సస్య శ్యామలమవుతాయని వివరించారు. వైరా రిజర్వాయర్లో సమృద్ధిగా సాగునీరు లేదని, వెంటనే వైరా రిజర్వాయర్ కు సాగర్ జలాలు కేటాయించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తనను అడిగారని స్పష్టం చేశారు. ఎంపీ నామా అడిగిన వెంటనే వైరా రిజర్వాయర్ ను సాగర్ జలాలతో నింపేశామని అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో ఇది సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. చిటుక వేసే లోపు వైరా రిజర్వాయర్ కు

సాగర్ జలాలు ఇచ్చామని స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి మండలాల్లో కరువును పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో వైరా నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బానోత్ మదన్ లాల్ కారు గుర్తుకు వైరా నియోజకవర్గ ఓటర్లు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2014 ముందు తర్వాత వైరా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలన్నారు. గతంలో పంచాయతీ గా ఉన్న వైరా ను మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి రోడ్లు, డివైడర్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సౌమ్యుడు మదన్ లాల్ గెలుపుతోనే వైరా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర, వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ , ఎమ్మెల్సీ తాతా మధు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, బీఆర్ఎస్ నాయకులు సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed