విద్యుత్ శాఖలో ‘కృష్ణుడి’ లీలలు .. ఏఈ కార్యాలయాన్నే ఆక్రమించుకున్న వైనం

by Disha Web Desk 6 |
విద్యుత్ శాఖలో ‘కృష్ణుడి’ లీలలు .. ఏఈ కార్యాలయాన్నే ఆక్రమించుకున్న వైనం
X

దిశ, వైరా : వైరా విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి పనితీరు నిరంతరం వివాదస్పదంగా మారుతుంది. విద్యుత్ శాఖలో ఆయన చెప్పిందే వేదమట.. గతంలో ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారి వైరా అసిస్టెంట్ డివిజన్ పరిధిలో కూడా అదే పందాలు కొనసాగిస్తున్నారు. ఆయనను చూస్తే విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులు కూడా భయపడతారనే ప్రచారం జరుగుతోంది. వైరా లోని డివిజన్ అధికారిని సైతం ఆ అధికారి లెక్కచేయని తీరు చూస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతుంది. రోజుకు రెండు గంటలు మాత్రమే విధులు నిర్వహించే అధికారి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పనులకు ఉపయోగించాల్సిన మహేంద్ర క్యాంపర్ వాహనాన్ని తన సొంత వాహనంలా వాడుకోవటం విశేషం. ఖమ్మం నుంచి ఇదే వాహనంలో నిరంతరం వైరా కార్యాలయానికి డైలీ సర్వీస్ చేస్తున్నారు. తన కార్యాలయంలో జరిగిన తప్పిదాలు బాహ్య ప్రపంచానికి బహిర్గతమైతే కింద స్థాయి సిబ్బందిపై విరుచుకుపడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ఖమ్మం కు చెందిన ఓ చక్రవర్తి అండ తో ఈ కృష్ణుడు లీలలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఏ ఈ కి ఉన్న కార్యాలయాన్ని ఆక్రమించుకొని ఇష్టా రాజ్యంగా ఆ అధికారి వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

రోజుకు రెండు గంటలే అధికారి విధులు..

రోజుకు రెండు గంటలు మాత్రమే ఆ అధికారి విధులకు హాజరయ్యే విషయం విద్యుత్ శాఖ తో పాటు విద్యుత్ వినియోగదారులకు తెలిసిన బహిరంగ రహస్యమే. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు కార్యాలయానికి వచ్చే ఆ అధికారి ఆరు గంటలకు తిరిగి ఖమ్మం వెళ్తున్నారు. ఆయన నివాసముంటున్న ఖమ్మం నుంచి వైరాకు వచ్చేందుకు తిరిగి వెళ్లేందుకు విద్యుత్ శాఖ అద్దెకు తీసుకున్న క్యాంపర్ వాహనాన్ని వాడుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుంచి క్యాంపర్ వాహనంలో వెళ్లే అధికారి మరలా మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు అదే క్యాంపర్ వాహనంలో ఆయన ఆఫీసుకు వస్తారు. ఆయన ఆఫీసుకు వచ్చిన రెండు గంటలు మాత్రమే క్యాంపర్ వాహనం వైరా సబ్ స్టేషన్ లో ఉంటుంది. వైరాలో ఓ విద్యుత్ ఆపరేటర్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డులను అధికారులు పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టంగా బహిర్గతమవుతాయి.

క్యాంపర్ వాహనంకు ప్రతినెలా తప్పుడు బిల్లులు..

ప్రతి నెలా సుమారు 2500 కిలోమీటర్లు తిరగాల్సిన క్యాంపర్ వాహనానికి అద్దె నగదు చెల్లించేందుకు తప్పుడు బిల్లులు పెడుతున్నారు. నిరంతరం క్యాంపర్ ను తన సొంత వాహనంలా వాడుకుంటున్న ఆ అధికారి ప్రతి నెల వైరా, బోనకల్ మండలాల్లో తిరిగినట్లు తప్పుడు వివరాలు చూపించి బిల్లు చేస్తున్నారు. ఈ మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లుకు తల్లాడ ఎస్పీఎంలో మరమ్మతులు చేపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ లు తల్లాడ తరలించి అక్కడి నుంచి మరల తమ గ్రామాలకు తీసుకువెళ్లేందుకు సర్పంచులు సొంత ఖర్చులతో బయట కిరాయికి వాహనాలను మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది సర్పంచులు పంచాయతీ ట్రాక్టర్ లో ట్రాన్స్ఫార్మర్లు రవాణా చేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా ఈ అధికారి బొలెరో క్యాపర్ వాహనానికి పెట్టిన బిల్లులపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అన్ని నిజాలు బహిర్గతమవుతాయి. ఇప్పటికైనా సీఎండీ స్పందించి అధికారిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటారో.... ఆ అధికారికి ఇదంతా "మామూలే" అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే.



Next Story