ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఎండ’ ప్రచండం.. నిప్పుల కుంపటిని తలపిస్తున్న గనుల ప్రాంతం

by Disha Web Desk 9 |
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘ఎండ’ ప్రచండం.. నిప్పుల కుంపటిని తలపిస్తున్న గనుల ప్రాంతం
X

దిశ బ్యూరో, ఖమ్మం: భానుడు భగ్గుమంటున్నాడు. నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న ఎండతీవ్రతకు మూడు రోజుల నుంచి వడ గాడ్పులు కూడా తోడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల నుంచి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణం. అనధికారికంగా ఇంకా ఎక్కువగానే ఎండ తీవ్రత ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఎండ తీవ్రతతో జనం ఇంట్లో ఉన్నా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.. వీటికి తోడు జ్వరాలు సైతం వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇంకా పెరగొచ్చనే అంచనా..

రాష్ట్రంలో ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంది. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం వేళలో నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎవరూ ఎండకు బయట తిరిగేందుకు సాహసించడం లేదు. అత్యవసర పనులుంటే తప్ప ఉదయం, సాయంత్రం వేళలలోనే పనులు ముగించుకుంటున్నారు. అంతేకాదు. బయటకు వెళ్లేటప్పుడు ఎవరికి వారు స్వచ్ఛందంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. తలకు వస్త్రాలు ధరిస్తూ ఎండ దెబ్బ నుంచి తప్పించుకుంటున్నారు. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లెందు, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం అయిందంటే చాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలిపిస్తోంది.

కోల్ బెల్ట్ ఏరియాలో మరీ దారుణం..

సాధారణంగానే పరిస్థితి ఇలా ఉంటే బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే 42 డిగ్రీలకు చేరవవుతుంటే ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో ఎండ ప్రచండాన్ని తలపిస్తుంటుంది. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులున్న ప్రాంతంలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక గనుల్లో పనిచేసే కార్మికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కంపెనీ తరఫున ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఎండా కాలం పని చేయాలంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెపుతున్నారు.

బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రతి సంవ్సతరం సింగరేణి తరఫున కార్మికుల కోసం ఎన్నో రక్షణ చర్యలు చేపడుతుంటారు. డ్యూటీ షిఫ్ట్ సమయాల్లో మార్పు తో పాటు, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేత, చల్లగా ఉండేందుకు షామియానాల వసతి.. ఇలా రకరకాల చర్యలు చేపడుతుంటారు. అయినా బొగ్గు ఉత్పత్తికి ఎండల వల్ల ఆటకం కలుగుతూనే ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కోల్ బెల్ట్ ఏరియాల్లోనే ఎక్కవ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

పెరుగుతున్న జ్వరాల తీవ్రత..

ఎండ ప్రచండానికి వడదెబ్బల కేసులు బాగా పెరుగుతున్నాయి. వడదెబ్బలతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వీటికి తోడు జ్వరాలు కూడా వస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. జ్వర పీడితులు బాగా పెరుగుతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

జాగ్రత్తలు పాటించాలి..

సమ్మర్ లో బయటకు వెళ్లాలంటే జాగ్రత్తలు అవసరం అంటున్నారు డాక్టర్లు. పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా కేర్ అవసరమని చెబుతున్నారు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే తలకు వస్త్రం కట్టుకోవాలని, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పుడే ఉష్ణగ్రతలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పనులు సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఉండేలా చూసుకోవాలని, మధ్యాహ్నం సమయంలో జర్నీలు ఉండకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. చల్లని పండ్ల రసాలు తాగుతూ ఎండ నుంచి ఉపశమనం పొందాలంటున్నారు. అంతేకాదు రోజులో నీటిని కూడా అధికంగా తాగాలని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు.

చల్లని పానీయాల కోసం..

ఈ సారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్యూస్ పాయింట్లు భారీగా భారీగా వెలిశాయి. రకరకాల పండ్ల జ్యూస్ లతో పాటు, డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో ఆకర్షణీయంగా పానీయాలను కస్టమర్ల కోసం తయారు చేస్తున్నారు. టేస్ట్‌తోపాటు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా ఈ జ్యూస్ పాయింట్లు, మిల్క్ షేక్స్ వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. సాయంత్రం వేళలో కుటుంబాలతో సహా చల్లచల్లగా జ్యూస్ పార్లర్లకు వెళ్తున్నారు. దుకాణాదారులు సైతం తమ కస్టమర్ల కోసం తాజా పండ్ల రసాలను తీసి అమ్ముతున్నారు.

ఇక కొబ్బరి బోండాలకు భలే గిరాకీ ఉంటుంది. ఎండ నుంచి త్వరగా ఉపశమనం కలిగించేందుకు కొబ్బరి బోండాలు ఎంతో ఉపయోగపడతాయి. పోయినసారి కంటే ఈ సారి రహదారుల వెంట ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుని మరీ విక్రయిస్తున్నారు. చెరకు రసం కూడా బాగా అమ్ముడవుతోంది. దాదాపు 15 రోజుల ముందు నుంచే రోడ్ల వెంట చెరుకు రసం బండ్లు వెలిశాయి. తాజా చెరుకు గడల నుంచి రసం తీసి లీటరు రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు.


Next Story