నియోజవర్గంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. ఏం జరగాలన్నా ఆయన పర్మిషన్ కావాల్సిందే..

by Dishafeatures2 |
నియోజవర్గంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. ఏం జరగాలన్నా ఆయన పర్మిషన్ కావాల్సిందే..
X

దిశ, ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్‌పై నియోజకవర్గంలో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహించడం.. భర్త హరిసింగ్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడడంతో నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవల పీకే నిర్వహించిన సర్వేలో కూడా హరిప్రియకు నియోజకవర్గంలో పూర్తి ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు సర్వే తేల్చేసిందని ప్రచారం జరుగుతుంది.

2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హరిప్రియ నాయక్ పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఆరు నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధి చేయాలని నినాదంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇల్లెందు నియోజకవర్గానికి రైల్వే స్టేషన్, బస్ డిపో, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఫారెస్ట్ స్కూల్ తీసుకువస్తానని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

విద్యావంతురాలు కావడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారు.. కానీ వారి ఆశ నిరాశే అయింది. ఆమె చెప్పిన ఏ హామీ నెరవేరలేదు. అంతేకాదు హామీలు నెరవేర్చేందుకు కనీసం తన వంతు ప్రయత్నాలు కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి.

పెరుగుతున్న వ్యతిరేకత..

హరిప్రియ నాయక్‌ను 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను ఓట్లడిగారు. అయితే వాటిని నెరవేర్చుకునేందుకే అధికార పార్టీలో చేరుతున్నానంటూ టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి ఎలాంటి సమస్యలను పట్టించుకోకపోవడమే కాదు.. సొంత ఆస్తుల సంపాదనపనే దృష్టి కేంద్రీకరించారు. ఇల్లందు అభివృద్ధి కోసం ఏ ఒక్క పని చేయలేదని నియోజకవర్గ ప్రజలే అనుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హరిప్రియ బయ్యారం స్టీల్ ప్లాంట్ తెలంగాణ హక్కు అంటూ మూడు రోజులు నిరాహార దీక్ష చేశారు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరగానే దాన్ని మర్చిపోయారు. అప్పుడప్పుడు అసెంబ్లీలో ఒకటి, రెండు సార్లు ప్రస్తావన చేశారు. కానీ ఏ రోజూ బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధించాలని ప్రత్యేక ఉద్యమం చేయలేదని బయ్యారం మండల ప్రజలు వాపోతున్నారు.

ఇల్లందు పట్టణ బీద ప్రజల ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న డబుల్ బెడ్ రూములు నేటికి కూడా పూర్తి కాకపోవడం.. పిల్లర్ల లెవెల్లోనే ఆగిపోవడంతో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హయాంలో కూడా పూర్తికావని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఇల్లందుకు రైలు ప్రయాణం వాగ్దానంలాగే ఉండిపోయిందని అనుకుంటున్నారు.

కౌన్సిలర్లలోనూ వ్యతిరేకత..

ఆరు నెలలుగా ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లలో చైర్మన్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. కౌన్సిలర్లు, చైర్మన్‌ని కూర్చోబెట్టి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడినా వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ ఏ ప్రోగ్రాం నిర్వహించిన అసంతృప్త కౌన్సిలర్లు ఆ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. అంతేకాక ఆ 12 మంది అసంతృప్త కౌన్సిలర్ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

హరిప్రియ తండ్రి భూ దందా..

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తండ్రి సీతారాం నాయక్ చుంచుపల్లి గ్రామ పంచాయతీలో భూములు ఆక్రమించారని, కూతురు హరిప్రియ నాయక్ అండతోనే భూముల ఆక్రమించారనే ప్రచారం జరుగుతోంది. భూముల ఆక్రమించిన బాధితులు తమ భూములు తమకు ఇవ్వాలని నిరాహార దీక్షలు, ర్యాలీలు సైతం నిర్వహించారు. బాధితులకు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు సంఘీభావం తెలియజేశారు. గతంలో ఎన్నోసార్లు ఈ ఘటనలు వార్తల్లోకెక్కాయి. సీతారాం నాయక్ తన కూతురు, అల్లుడి అండ చూసుకునే ఆక్రమణలకు పాల్పడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి.

షాడో ఎమ్మెల్యేగా భర్త హరిసింగ్

నియోజకవర్గంలో ఏ అధికారి అయిన.. ఏ కాంట్రాక్టర్ అయినా.. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే కంటే ముందు భర్త హరిసింగ్ నాయక్ ను కలిస్తేనే పనులవుతాయని ప్రచారం జరుగుతోంది. ఇల్లందు మార్కెట్ కమిటీ పదవి ఎమ్మెల్యే భర్త హరిసింగ్ నాయక్‌కు ఇవ్వడంతో ఆ పదవిపై ఆశ పెట్టుకున్న ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు ఆశలు అడియాశలయ్యాయి.. కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లంబాడి కులస్తులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని, ఎస్టీ కోయ వర్గానికి చెందిన వారికి వైస్ చైర్మన్ పదవిని అప్పచెప్పారు. కానీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టారు. అంతేకాక తన భర్తకి ఇవ్వడంతో చాలామంది కోయ సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఉద్యమకారులకు ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగింది.

ఏ ప్రజా ప్రతినిధి అయినా, టీఆర్ఎస్ కార్యకర్త అయినా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కొచ్చి ఎమ్మెల్యేని కలవాలంటే కొన్ని గంటలు పడుతుందని కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏ ప్రారంభం అయినా, శంకుస్థాపనైనా షాడో ఎమ్మెల్యే ఆయన భర్త హరిసింగ్ నాయక్ చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ఇటీవల కామేపల్లి మండలంలో రోడ్డు శంకుస్థాపనకు షాడో ఎమ్మెల్యే వెళ్తే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తగాదా జరిగింది.

ఏ అధికారంతో రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు షాడో ఎమ్మెల్యే అని అడగడంతో గొడవ ప్రారంభమైంది. అక్కడ ఉన్న పోలీసులు కలగజేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులను సముదాయించారు. కామేపల్లి మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే, ఎంపీ ప్రజా ప్రతినిధులు మాత్రమే శంకుస్థాపనలు చేయాలి.. కానీ ఏ ప్రజా ప్రతినిధి కానటువంటి షాడో ఎమ్మెల్యే ఏ విధంగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారని విమర్శిస్తున్నారు.

పైరవీలకు రెడీ..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో టికెట్ ఆశించే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో సీటు ఆశించి బంగపడిన నేతలు, ఓడిపోయిన నేతలు ఇల్లందు సీటుపై కన్నేశారు. పీకే సర్వే రిపోర్టు సైతం హరిప్రియకు నెగిటివ్‌గా రావడంతో ఈసారి ఆమెకు టికెట్ దక్కదనే సంకేతాలు కూడా అందినట్లు పలువురు టికెట్ ఆశించే నాయకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హరిప్రియ సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

'KCRపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తా'


Next Story

Most Viewed