పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు.. ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్

by GSrikanth |
పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు.. ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్
X

దిశ, సిటీబ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియను పక్కాగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ వంటి కీలక ఘట్టాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా ముగియటంతో ఎన్నికల యంత్రాంగం ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ నిర్వహించాలంటే బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా కావల్సి ఉంటుంది. హైదారాబాద్ జిల్లాలలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా సోమవారం మధ్యాహ్నం నాటికి తేలనుంది. ఆ తర్వాత రోజైన మంగళవారం నుంచి రెండు పార్లమెంట్ స్థానాలకు, మరో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను రూపకల్పన చేసిన తర్వాత ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్లను మూడు దశలుగా చెకింగ్ చేసిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తర్వాత ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

ఇందుకు సంబంధించి బ్యాలెట్ పేపర్ ఖరారైన తర్వాత వాటిని ఈవీఎంలలో కమీషనింగ్ చేసేందుకు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఇద్దరు ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు చొప్పున రెండు పార్లమెంట్ స్థానాలకు 28 మంది ఇంజినీర్లు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి మరో ఇద్దరు ఇంజినీర్లు, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియను నిర్వహించి, బ్యాలెట్ పేపర్‌ను ఈవీఎంలో కమీషనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ కమిషనీంగ్ సక్సెస్ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన డీఆర్సీ సెంటర్లలోని స్ట్రాంగ్‌లలో ఈవీఎంలను భధ్రపరచనున్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు వీటిని సదరు పోలింగ్ స్టేషన్ల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అప్పగించి, పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి అక్కడే స్వీకరించి, మళ్లీ స్ట్రాంగ్ రూమ్‌లలో హెవీ సెక్యూరిటీ మధ్య నుంచి కౌంటింగ్ రోజు మళ్లీ రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, పరిశీలకులతో పాటు సెక్టోరల్ ఆఫీసర్ల సమక్షంలో వీటిని బయటకు తీయనున్నారు.

త్వరలో డీఆర్సీ సెంటర్లు ఖరారు..

హైదరాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డీఆర్సీ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రేపో, మాపో ప్రకటించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఎంపీ ఎన్నికకు ఉపయోగించే ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వినియోగించే ఈవీఎంలలో మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థుల వివరాలతో రూపకల్పన చేసిన బ్యాలెట్ పేపర్‌తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్‌తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల బరిలో నిలిచిన రెండు బ్యాలెట్ పేపర్లను ఈవీఎంలలో కమీషనింగ్ చేయనున్నారు.Next Story

Most Viewed