Education: దటీజ్ స్టడీ వాల్యూ...

by Dishanational1 |
Education: దటీజ్ స్టడీ వాల్యూ...
X

దిశ, వైరా: చదువు అనేది ప్రతి మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉపయోగపడే గొప్ప ఆయుధం. అన్నదానం ఆకలిని మాత్రమే తీరిస్తే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ముఖ్యమంత్రి లాంటి వాళ్లు కూడా నిలబడి దగ్గరుండి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారంటే అది కేవలం చదువుతో అధికారులు సాధించిన ఉద్యోగానికి ఇస్తున్న విలువ అనేది గ్రహించాలి. ఈనెల 18వ తేదీన ఖమ్మం శివారులోని వి వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్, కేరళ సీఎం పిన్నరై విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి, భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ను నలుగురు ముఖ్యమంత్రులు దగ్గరుండి కలెక్టర్ ఛాంబర్ లోని ఆయన సీట్లో కూర్చోబెట్టారు. నలుగురు ముఖ్యమంత్రులు కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించే ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్ములపై ఈ ఫొటో చక్కర్లు కొడుతుంది. "నలుగురు ముఖ్యమంత్రులు దగ్గరుండి ఒక కలెక్టర్ ను సీట్లో కూర్చోబెట్టారంటే.... ఈ కలెక్టర్ ఎంత అదృష్టవంతుడో కదా... నలుగురు ముఖ్యమంత్రుల ముందు కూర్చోవడం అంటే ఒక ఐఏఎస్ కు మాత్రమే సాధ్యమైంది... అందుకే చదువుకోవాలనేది"... అనే అంశాన్ని ఫొటోకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ప్రజలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీంతో నెటిజెన్లు చదువు గొప్పతనాన్ని వివరిస్తూ కామెంట్లు చేస్తున్నారు.



Next Story