- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా రైతు బంధు కింద ఏటా లక్ష స్వాహా
కొణిజర్ల మండలం తీగల బంజర గ్రామ పంచాయతీ మంగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను సృష్టించిన నకిలీ పత్రాలతో చేస్తున్న భూ అక్రమణలు ఎన్నెన్నో... వాటిలో కొన్నింటిని ఫిబ్రవరి 24న 'దిశ' పత్రిక బహిర్గతం చేసింది.

అసైన్డ్ ఆక్రమణ
ఉపాధ్యాయురాలి పేరుతో పట్టా
అక్రమంగా రైతుబంధు కింద ఏటా లక్ష స్వాహా
చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టరుకు ఫిర్యాదు
దిశ, కొణిజర్ల: కొణిజర్ల మండలం తీగల బంజర గ్రామ పంచాయతీ మంగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను సృష్టించిన నకిలీ పత్రాలతో చేస్తున్న భూ అక్రమణలు ఎన్నెన్నో... వాటిలో కొన్నింటిని ఫిబ్రవరి 24న 'దిశ' పత్రిక బహిర్గతం చేసింది. దిశలో ప్రచురితమైన కథనం సదరు అక్రమార్కుడి వెన్నులో వణుకు పుట్టించింది. దిశ నిఘాలో వెలుగులోకి వచ్చిన మరికొన్ని ఆక్రమణలు వివరాలను పరిశీలిస్తే... గ్రామంలోని ఓ వ్యక్తికి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 15ఎకరాలకు పైగా పట్టా భూమి ఉంది. అయినా దాహం తీరని భూ బకాసురుడు తన నేరపూరిత ఆలోచనలతో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ, జాగిర్దార్ భూములను నకిలీ డాక్యూమెంట్లతో కాజేయటం కాజేసిన భూములను అధికారులను నయనో భయనో మెప్పించి, పట్టా దారు పాసు పుస్తకాలు తీసుకోవటంలో అందవేసిన చేయి. ఈ తరహా మోసపూరిత ఆలోచనలతోనే గుబ్బగుర్తి గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారుగా 8.20ఎకరాల పంచరాయి భూమి ఆక్రమించాడు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ 2.50 కోట్లు విలువ ఉంటుంది. ఆక్రమించిన భూమిని తనతోపాటు తన సోదరి ఆధీనంలో ఉంది.
గుబ్బగుర్తి గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 414లో 60ఎకరాలకు పైగా పంచరాయి భూమి ఉంది. నిషేదిత భూమి అయినప్పటికీ అనేక మంది అనర్హులు సేద్యం చేస్తూ అనుభవిస్తున్నారు. అనుభవించటమే కాకుండా ఎంచక్కా పట్టాదారు పాసు పుస్తకాలు పొంది రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని ఆరగిస్తున్నారు. ఇదే భూమిలో వైరా పట్టణానికి చెందిన ఒక వ్యాపారి 4 ఎకరాలకు దొడ్డిదారిలో గతంలో పట్టా పొందాడు. ఇదే సర్వే నెంబరులో 10ఎకరాల భూమిని మిలటరీలో పని చేసి రిటైరైన ఖమ్మం నగరానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీమాల ఆంథోని అనే వ్యక్తికి ప్రభుత్వం అసైన్డ్ చేసింది. భూమి మెకాల కుంట గ్రామ సమీపం ఉండగా లబ్ధిదారుడు ఖమ్మంలో నివాసం ఉండటంతో కొన్నేళ్ల పాటు సేద్యం చేయకుండా బీడుగా ఉంది. దీంతో చుట్టు పక్క పొలాల రైతులు తమ పశువులను మేపుకునే వారు. ఈ క్రమంలోనే ఆక్రమణకు గురైందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా సర్వే నెంబర్ 414లో భూమి నిషేదిత జాబితాలో ఉంది. కానీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి సదరు భూమిలో 4.35ఎకరాలు తన పేరుతో పట్టా చేయించుకున్నాడు.
అంతటితో ఆగలేదు సరికదా ఇదే పంచరాయి సర్వే నెంబరులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన తన సోదరి పేరుతో 3.26ఎకరాల భూమిని అసైన్‌మెంట్ భూమి అధికారుల చేత పట్టా ఇప్పించాడు. ఈమె ప్రస్తుతం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ నెలకు లక్ష రూపాయలకు పైగా వేతనం తీసుకుంటుంది. 2019 సంవత్సరంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్ ఇరువురికి పాసు పుస్తకాలు అందజేశారు. పట్టాదారుని పాసు పుస్తకం వచ్చింది మొదలు నేటి వరకు ఇరువురు ప్రతి ఏటా సుమారు లక్ష రూపాయలకు పైగా రైతు బంధు ఆరగిస్తున్నారు. గుబ్బగుర్తి రెవిన్యూ పరిధిలో సర్వే నేంబర్ 414లో ఆక్రమణకు గురైన పంచరాయి భూమిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ మెకాల కుంట గ్రామానికి చెందిన మహమ్మద్ అన్వర్ పాషా అనే వ్యక్తి గత 15రోజుల క్రితం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తోపాటు ఆర్డీఓ స్థానిక తహసీల్దారుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై నేటికి ఎలాంటి స్పందన లేదు. సర్వే నెంబర్ 414లో ఆక్రమణకు గురైన పంచరాయి భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నాటి నుంచి నేటి వరకు రైతుబంధు పేరుతో అక్రమంగా స్వాహా చేసిన లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వసూలు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విచారణ చేపడతాం
అరుణ, తహసీల్దార్
నిషేధిత పంచరాయ భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన విషయంపై విచారణ చేసి చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటాం.
పంచరాయి ఆక్రమణలపై ఫిర్యాదు చేశా
అన్వర్ పాష
గుబ్బగుర్తి రెవెన్యూ పరిధిలో 8.20ఎకరాల పంచరాయి భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై 15రోజుల క్రితం ప్రజావాణిలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశా.






