నేత్రపర్వంగా తెప్పోత్సవం

by Disha Web Desk 15 |
నేత్రపర్వంగా తెప్పోత్సవం
X

దిశ, ఖమ్మం కల్చరల్ : హైమాస్ట్​ లైట్లు .. రంగుల దీపాలు.. జిగేల్ మనే కాంతిలో లకారం ట్యాంక్ బండ్ జలాశయంలో కల్యాణ రాముడు తెప్పోత్స వం నేత్రపర్వంగా సాగింది. జైశ్రీరామ్ నామస్మరణ మారు మోగింది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం సాయంత్రం ఇందిరానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం సీతారాముళ్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై ఉంచి మేళతాళలు, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా లకారం ట్యాంక్ బండ్​ వద్దకు తీసుకొచ్చారు.

స్వామి వారి శోభాయాత్ర కు ముందు 500 మందితో లయబద్ధంగా మహిళలు నిర్వహించిన కోలాట ప్రదర్శన, బాణా సంచాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. ఈ ఊరేగింపు సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. భద్రాద్రి తరహాలో ఖమ్మం పర్ణశాల సీతారామచంద్ర స్వామిని లకారం చెరువులో తెప్పోత్స వానికి తోడుకోచ్చారు. రంగుల మయంతో అలంకరించిన హంసవాహనం (మరపడవ)పై సీతారాముల విగ్రహాలను ఎక్కించి వేదపండితులు అష్టోత్తరాన్ని పఠించి జలాశయంలో సీతారాముళ్లను విహరింప చేశారు. కిక్కిరిసిన భక్తుల నడుమ హంస వాహనంపై నీటిలో మూడు పర్యాయాలు తిప్పారు. ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed