సీఎంని గద్దె దించడమే నా లక్ష్యం : పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 15 |
సీఎంని గద్దె దించడమే నా లక్ష్యం : పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, భద్రాచలం : సీఎంని గద్దె దించడమే తన లక్ష్యం అని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెల్లం వెంకటరావు ఆధ్వర్యంలో భద్రాచలం కళాశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఎనిమిదవ ఆత్మీయ సమ్మేళన సభ అని, అది కూడా రాముని సన్నిధానంలో జరగడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో భద్రాచలానికి తీరని లోటు జరుగుతూనే ఉంది అని బాధపడ్డారు. ఇంత గొప్ప పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని ఎందుకు ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది అని, తొమ్మిది సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే సీఎం పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు అన్నారు. ఆలయానికి గతంలో 100 కోట్లు ప్రకటించారని, అలాగే వరదలు వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంతవరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వరదల సమయంలో రూ.1000 కోట్లు భద్రాచలానికి కేటాయిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు.

టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన పేపర్ లీకేజీ కారణాలు ఏమున్నాయి, ఎవరు ఇందుకు కారణం అని తెలుసుకోకుండానే పరీక్షలు రద్దు చేశారని, దీనివలన ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్న నిరుద్యోగులకు తీరని నిరాశే మిగిలిందన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని, ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఎదురుచూసి కలలు కన్న నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడూ ప్రజల మనిషే అన్నారు. నిధులు, నియామకాలు, నీళ్లు ఏవైనా కేవలం కల్వకుంట్ల వారి కుటుంబానికి మాత్రమే తప్ప సామాన్యుడి అందుబాటులో ఉండమని ఆరోపించారు. డాక్టర్ తెల్ల వెంకటరావు మాట్లాడుతూ పొంగులేటి శ్రీనన్న తనకు వైద్యమే కాదు ప్రజలకు సేవ కూడా చేయాలని సీట్ ఇప్పించారన్నారు. ఇక్కడి నేతలు కనీసం ఒక్కసారి కూడా భద్రాచల చుట్టుపక్కల ఉన్న ఐదు మండలాల గురించి అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు అన్నారు.

అధికారంలో లేకపోయినా కూడా పొంగిలేటి శ్రీనన్న వరదల సమయంలో కోటిన్నర ఖర్చుపెట్టి ఈ భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు సేవలు అందించారన్నారు. తాను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా శ్రీనన్న సహాయంతో సీపీఎం పార్టీని గెలిపించామని చెప్పారు. భద్రాచలానికి ప్రభుత్వం ఇచ్చే కోట్లు ఏమో కానీ సున్నా కాకుండా చూసుకోవడం మన బాధ్యత అన్నారు. కోరం కనకయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు ఓట్లు దండుకొని బయటపడ్డ నాయకులే ఉన్నారు కానీ భద్రాచలాన్ని అభివృద్ధి చేసింది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భద్రాచలం చుట్టుపక్కల ఐదు మండలాల నుంచి కేవలం పొంగిలేటి శ్రీనన్న మీద అభిమానంతోనే వచ్చారు అన్నారు. తాము పొంగిలేటన్న వర్గం అని మాకు ఉన్న గన్మెన్లను తీసేశారని పేర్కొన్నారు.

తమకు ఏ నష్టం కలిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మన భద్రాచలానికి తెల్లం వెంకటరావు వస్తేనే మళ్లీ అభివృద్ధి పనులు మొదలవుతాయని, అది పొంగిలేటి శ్రీనన్న సారథ్యంలోనే జరుగుతుందని చెప్పారు. మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ పొంగిలేటి శ్రీనన్న అంటే ఒక వ్యక్తి కాదు అతను ప్రజల యొక్క శక్తి అన్నారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెడమర్తి రవి మాట్లాడుతూ ఇది 8వ ఆత్మీయ సమ్మేళన సభ అని, తాను తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ పోరాటంలో పాలుపంచుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నా అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు తనపై బెదిరింపు చర్యలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనన్న రాజ్యం వస్తుందని చెప్పారు.


Next Story

Most Viewed