కోడి పందెలు ఉన్న.. క్రికెట్ మ్యాచ్ ఉన్న.. సభకు రావాల్సిందే: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
కోడి పందెలు ఉన్న.. క్రికెట్ మ్యాచ్ ఉన్న.. సభకు రావాల్సిందే: మంత్రి హరీష్ రావు
X

దిశ, వైరా: తెలంగాణ రాష్ట్రంలో ఆచరిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేంద్రంతో పాటు దేశంలోనే అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ సన్నాహాక సమావేశాన్ని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ తల్లి లాంటిదని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపును తల్లి ఆదేశంతో సమానంగా పాటించి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత వైరా నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. సంక్రాంతి పండుగతో పాటు సరిహద్దుల్లోని కోడి పందాలను, క్రికెట్ వన్డే మ్యాచ్లను, వ్యవసాయ పనులను సైతం వదిలిపెట్టి నాలుగు రోజులు కష్టపడి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

వైరా నియోజకవర్గ నుంచి 50 వేల మందిని ఈ బహిరంగ సభకు తరలించాలని పిలుపునిచ్చారు. బస్సులతో పాటు ఇతర వాహనాలలో బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సభ రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, 1962తో పాటు అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టి అమలుచేస్తుందని వివరించారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ మహాసభకు సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించాలని మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీలతో గ్రామాల్లో వైరుధ్యం వద్దని స్పష్టం చేశారు.

వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ వినతి మేరకు వైరా, కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కొనిజర్ల మండల ప్రజలు పాదయాత్రగా బహిరంగ సభకు రావాలని కోరారు.

బావా బామ్మర్దులు బాగానే ఉన్నారు.. హరీష్ రావు చలోక్తులు

బావా బామ్మర్దులు బాగానే ఉన్నారు. కింద ఉన్న నాయకులు కార్యకర్తలు పరేషాన్ అయితుండ్రు.. అంటూ వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాలపై మంత్రి హరీష్ రావు చలోక్తులు విసిరారు. వైరాలో జరిగిన సన్నాక సమావేశానికి ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ వర్గీయులు వేరువేరుగా ర్యాలీగా హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే మదన్లాల్ వర్గీయులు జై మదన్లాల్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా సభా అధ్యక్షుడు రాముల నాయక్ అనే పేరు చెప్పగానే రాములు నాయక్ వర్గీయులు జై రాములు నాయక్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో సభలో కొద్దిసేపు నినాదాల పర్వం కొనసాగింది. దీంతో ఎంపీ నామా నాగేశ్వరరావు కలుగచేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ అని.. ఆయన కిందే ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఎంపీ నామా విజ్ఞప్తి మేరకు నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయకుండా ఆపారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. మదన్ లాల్ తన బావ అంటూ వ్యాఖ్యానించటంతో సభలో నవ్వులు విరిశాయి. ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్లాల్, బానోత్ చంద్రావతి లకు పార్టీ నుంచి మంచి గుర్తింపు ఉంటుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వైరా, ఆందోల్ ఎమ్మెల్యేలు రాములు నాయక్, క్రాంతి కిరణ్, మాజీమంత్రి బసవరాజు సారయ్య, శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్లాల్, బానోత్ చంద్రావతి, డీసీఎం ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మార్కెట్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం తదితరులు పాల్గొన్నారు.

Next Story