ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. ఆ నియోజకవర్గాల నుండే బరిలోకి పొంగులేటి, తుమ్మల..!

by Disha Web Desk 19 |
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. ఆ నియోజకవర్గాల నుండే బరిలోకి పొంగులేటి, తుమ్మల..!
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అటు వామపక్షాలతో పొత్తు.. ఇటు సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఖరారు కత్తిమీద సామే అయినా ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందినట్లు ప్రచారం జరుగుతుంది. టికెట్ దక్కనివారిని కారణాలు విశ్లేషించి ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.

దిశ బ్యూరో, ఖమ్మం: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముందని, ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటం, వామపక్షాలతో పొత్తులపై చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యమైందని, ఇంకా ఆలస్యం చేయడం తగదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం సాధ్యమైనంత త్వరలో అభ్యర్థుల పేర్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఖరారైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందినట్లు, నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు చేసుకునేందుకు సిద్ధం కావాలని అధిష్టానం పెద్దలు సూచించినట్లు తెలుస్తుంది.

ఖమ్మం బరిలో తుమ్మల నాగేశ్వరరావు..

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బరిలో నిలువనున్నారని తాజా సమాచారం. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరతొలిగిందని, తుమ్మల అభ్యర్థిత్వం ఖరారైనట్లు అధిష్టానం ప్రకటించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీతో నేడు జరిగిన చర్చల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. జిల్లాలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన తుమ్మల నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఖమ్మంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు భారీగానే అనుచరులు ఉన్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరగా.. ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం కలిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఓటమికి తన పార్టీ నాయకులే కారణమని కినుకు వహించినా, బీఆర్ఎస్ అధిష్టానం సూచన మేరకు పార్టీలోనే కొనసాగారు. చివరకు పొమ్మనకుండా పొగపెడుతుండటంతో పార్టీలో కొనసాగలేని పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదటినుంచి పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావించినా మారిన ఈక్వేషన్ల కారణంగా ఖమ్మం బరి నుంచి పోటీలో ఉండాల్సి వస్తుంది.

పాలేరు నుంచి పొంగులేటి..

బీఆర్ఎస్ పార్టీలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న మరో జిల్లా నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పార్టీ కోసం ఎంత కష్ట పడ్డా ఫలితం దక్కడం లేదని, చెప్పుడు మాటలు విని అధిష్టానం దూరం పెట్టిందని భావించిన పొంగులేటి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం అనేక సమ్మేళనాలు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల సూచనలు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ స్థానాలైన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఏదైనా ఒకదాని నుంచి పోటీ చేస్తారని భావించారు.

మొదట ఖమ్మం, తర్వాత పాలేరు, చివరకు కొత్తగూడెం పేర్లు వినిపించాయి. పాలేరులో పోటీచేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పొంగులేటి ముఖ్య అనుచరుడు ఒకరు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే పొంగులేటి పాలేరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, క్యాంపు కార్యాలయ ఇన్చార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి గడపగడపకూ కాంగ్రెస్ పేరిట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు

1. ఖమ్మం‌‌‌‌‌==== తుమ్మల నాగేశ్వరరావు

2. పాలేరు==== పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

3. సత్తుపల్లి=== మట్టా రాగమయి

4. మధిర=== భట్టి విక్రమార్క

5. భద్రాచలం=== పొదెం వీరయ్య

6. కొత్తగూడెం==== కూనంనేని సాంబశివరావు (పొత్తు ఉంటే) లేకుంటే ఎడవల్లి కృష్ణ

7. ఇల్లెందు==== కోరం కనకయ్య



Next Story

Most Viewed