ఆ రాత్రి ఏం జరిగింది... అంతుచిక్కని రహస్యం ?

by Disha Web Desk |
ఆ రాత్రి ఏం జరిగింది... అంతుచిక్కని రహస్యం ?
X

దిశ,కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం త్రిమాతా గుడి వద్ద గురువారం ఐచర్ వాహనంలో పోలీసులకు పట్టుబడ్డ 200క్వింటాళ్ల రేషన్ బియ్యం కథ అంతుచిక్కడం లేదు. అవి ఎవరివి, ఎక్కడికి వెళుతున్నాయి, ఎవరు తీసుకు వెళుతున్నారనే విషయం పక్కన పెడితే పట్టణ నడిబొడ్డులో జనావాసాల మధ్య అక్రమంగా తరలిస్తున్న బియ్యం లోడును ఇక్కడ ఎందుకు ఉంచారనేది స్థానికులను వెంటాడుతున్నాయి. మరోవైపు ఉదంతంలో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్ బియ్యం తరలిస్తున్న వారితో రూ.4లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, డబ్బులిచ్చి తీసుకెళ్లే సమయంలో వాహనం బురదలో కూరుకుపోయిందని తెలుస్తున్నది. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో మరో వాహనం పట్టుకునేందుకే ఇలా చేశానని చెబుతూ ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేశాడని సమాచారం.

ఇల్లందు నియోజకవర్గం బోజ్జాయిగూడెం సూదిమల్ల గ్రామం వద్ద 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ కాకినాడకు అక్రమంగా తరలించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఆరేషన్ బియ్యాన్ని పట్టుకోడానికి పకడ్బందీ స్కెచ్ వేసి సొమ్ముచేసుకోవాలని భావించాడు. ప్లాన్ ప్రకారం ఇల్లందు నుంచి కొత్తగూడెం మధ్య రహదారిలో బియ్యం లోడును ఆపి దాన్ని వదలాలంటే రూ.4లక్షలు ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నారని, ఆడబ్బు ముట్టజెప్పేంతవరకు ఈలోడు తమ దగ్గరే ఉంటుందని చెప్పడంతో బియ్యాన్ని తరలిస్తున్న వారు సరే అన్నట్లు తెలుస్తోంది. డబ్బు కట్టేంతవరకు ఆ బండిని త్రీమాతా టెంపుల్ వద్ద ఉంచారు. అనుకున్నట్లుగానే అడిగినంత డబ్బు ముట్టజెప్పి వాహనాన్ని తీసే క్రమంలో అధిక బరువు ఉండటంతో బురదలో కూరుకుపోయింది. ఇంకేముంది తేలుకుట్టిన దొంగలా అయింది ఆ అధికారి పరిస్థితి. తెల్లారితే అసలు రంగు బయటపడుతుందని వాహనాన్ని బురదలో నుంచి తీయడానికి శతవిధాల ప్రయత్నాలు చేసినా, అది రాలేదు. ఈవిషయం ఆనోటా ఈనోటా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది.

అనుమానాలెన్నో..

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ బియ్యం తరలిస్తున్న నలుగురి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బియ్యం లోడును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారిని వివరణ కోరగా.. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నది తానేనని వెనుక ఇంకొక బండి వస్తోందని, ఆ బండిని పట్టుకోవడానికి ఈ బండిని దాచి ఉంచామని చెప్పడం గమనార్హం. ఒకవేళ తానే బండి పట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి ఉన్నా అది చేయలేదు. సిబ్బందిని ఒకరిని అక్కడ ఉంచకపోవగా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. తప్పించే ఈప్రయత్నంలో భాగంగా తనకు నచ్చినట్లు వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీరా దొరికిన తర్వాత తప్పు కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విషయం తెలిసిన ఉన్నతాధికారులు సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆరోపణలు వస్తున్న అవినీతి అధికారిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.


Next Story

Most Viewed