ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ వర్తింపజేయాలి

by Disha Web Desk 15 |
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ వర్తింపజేయాలి
X

దిశ,మణుగూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ వర్తింపజేయాలని మండల సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ వర్తింపజేయాలని రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న దళిత బంధు, బీసీ రుణాలు, గృహలక్ష్మి పథకం లాంటివి అర్హులైన నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో డబుల్ బెడ్ రూమ్స్ నిరుపయోగంగా ఉన్నాయని,

వెంటనే అర్హత కలిగిన వారికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గిరిజనులకు గిరిజన బంధు ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఎంతోమంది పేద ప్రజలకు రేషన్ కార్డు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ఎర్రజెండాలు చేత పట్టుకొని సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని తెలిపారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందకపోతే సీపీఐ ఏం చేయాలో అది చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కుటుంబరావు, మండల, పట్టణ కార్యదర్శిలు జంగం మోహన్ రావు, దుర్గాల సుధాకర్ లు, జిల్లా సమితి సభ్యులు ఆర్.లక్ష్మీనారాయణ, ఎస్ కే సర్వర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story