తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నకిలీ మకిలీ

by Disha Web Desk 9 |
తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నకిలీ మకిలీ
X

దిశ, వైరా : ప్రైవేట్ వ్యాపారులు, దళారులు నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తున్నారని నిత్యం మనం పత్రికల్లో చూస్తూనే ఉంటాం. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని వ్యవసాయ అధికారులు నిత్యం హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే సబ్సిడీపై రైతులకు వైరాలో నకిలీ విత్తనాలు పంపిణీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కంచే చేను మేసిన చందాగా నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ రైతులకు ఆ నకిలీ విత్తనాలను విక్రయించింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి సొసైటీ గోదాములకు నకిలీ విత్తనాలు సరఫరా కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నకిలీ మకిలీ అంటింది.

ఆర్భాటంగా కూపన్లు పంపిణీ....అనంతరం నకిలీ విత్తనాల అందజేత

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల మూడో తేదీన వైరాలో జరిగిన రైతు దినోత్సవం సభలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా రైతులకు జీలుగు విత్తనాల కుపన్లు పంపిణీ చేశారు. అనంతరం ఈనెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన జీలుగు విత్తనాలను రైతులకు అందజేశారు. వైరా మండలంలోని సోమవారం గ్రామానికి చెందిన 72 మంది రైతులకు 310 జీలుగు బ్యాగులను అధికారులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సబ్సిడీ బోను 30 కేజీల జీలుగు బ్యాగుకు రూ.842.70 పైసలను రైతులు చెల్లించారు. అయితే రైతులు ఇంటికి తీసుకువెళ్లిన విత్తనాలను పరిశీలించగా నకిలీవిగా తేలాయి. ఈ విత్తనాలు పలు రంగుల్లో ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థ పేరును ముద్రించిన బ్యాగులో ప్రభుత్వ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించటం ప్రస్తుతం విమర్శలు తయారుచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ నుంచి వైరా సొసైటీ కి sts-knl 1495/p568, 569 రెండు లాట్ల నెంబర్ల పేరుతో సోమవారం మొత్తం 830 జీలుగు బస్తాలు వైరా సొసైటీ కి వచ్చాయి.

ఈ విత్తనాలను కొనుగోలు చేసిన సోమవారం రైతులు నకిలీ విత్తనాలుగా అనుమానించారు. పలు రకాల రంగుల్లో ఈ విత్తనాలు ఉండటంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం తీసుకువచ్చి సొసైటీ గోదాంలో రిటర్న్ చేశారు. ప్రభుత్వం ద్వారా తమకు నకిలీ విత్తనాలు ఎందుకు విక్రయించారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో సొసైటీ అధికారులు రైతులకు మరోసారి కుపన్లు రాసి తాటిపూడి సెంటర్లో విత్తనాలు కేటాయించారు. ఈ విషయమై వైరా మండల వ్యవసాయ అధికారి శ్రీరామోజి పవన్ కుమార్ ను వివరణ కోరగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరీక్షించిన తర్వాతనే విత్తనాలు సొసైటీలకు వస్తాయని చెప్పారు. రెండు లాట్ నెంబర్లు లో వైరా గోదాం కి వచ్చిన జీలుగు విత్తనాల రంగులో తేడా ఉందని అంగీకరించారు. తేడాగా ఉన్న విత్తనాలను రైతులు నుంచి రిటర్న్ తీసుకుని తాటిపూడి సెంటర్లో మరలా వారికి విత్తనాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పలు రంగుల్లో ఉన్న విత్తనాల బస్తాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు రిటర్న్ చేస్తున్నామని వివరణ ఇచ్చారు


Next Story

Most Viewed