పులిగుట్ట జాతరకు పోటెత్తిన భక్తులు

by Disha Web Desk 15 |
పులిగుట్ట జాతరకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వైరా : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వైరా మండలంలోని గొల్లపూడి గ్రామ సమీపంలో ఉన్న పులిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద గురువారం నిర్వహించిన జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా పులిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపి జాతర నిర్వహిస్తారు. ఈ దేవాలయం వద్ద గురువారం కూడా స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా సీతారాముల విగ్రహాలను పల్లకిలో ఉంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలో ఉన్న కల్యాణ మండపంలో అర్చకులు సీతారాముల వారి కల్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు.

ఈ జాతరను తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైరా మండలం తో పాటు బోనకల్, మధిర, కొణిజర్ల, తల్లాడ, గంపలగూడెం తదితర మండలాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, ఆటోలు, కార్లతో పాటు ఇతర వాహనాల్లో పులిగుట్ట వద్దకు చేరుకున్నారు. ఈ జాతరకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ హాజరై లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే కు ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతరలో కలియ తిరిగిన ఎమ్మెల్యే రాములు నాయక్ భక్తులతో మాట్లాడారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీ కె. రత్నం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ మడుపల్లి సైదారావు , గ్రామ సర్పంచ్ పసుపులేటి వినోద, కమిటీ సభ్యులు రాయల రామకృష్ణ , రామాల వెంకటేశ్వర్లు, వీసం శ్రీనివాస రావు, దేవస్థానం ఈవో ప్రసాద్ రావు, అసిస్టెంట్ ఈవో దిరిశాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed