అవినీతి, అక్రమాలు, బెదిరింపులు.. రెచ్చిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే

by Disha Web Desk 4 |
అవినీతి, అక్రమాలు, బెదిరింపులు.. రెచ్చిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: పినపాక నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నేతలు రెచ్చిపోతున్నారు. పార్టీలో వర్గ విభేదాలు ఓ వైపు రెచ్చగొడుతూనే, మరోవైపు అధికారులను సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆయన అనుచరుల గుత్తాధిపత్యంతో అటు పార్టీలోని ఓ వర్గంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సైతం మానసిక వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పెత్తనంతో నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వాటికి సహకరించాలంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, కొందరు రేగా అనుచరులు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. లేదంటే ఉన్నతాధికారులు, పార్టీ పెద్దలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారు చెప్పిన పనులకు ఔననలేక.. కాదనలేక మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే రేగా తమ అనుచరుల చేత అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నా అండగా నిలుస్తున్నారనే టాక్ నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో గిరిజన చట్టాలను పరిరక్షించాల్సిన అధికార పార్టీ నేతలే అక్రమార్కులకు కొమ్ముకాయడం.. ప్రభుత్వ ఉద్యోగులతో పనులు చేయించుకోవడం పరిపాటిగా మారింది. వీరు చెప్పిన పనులు చేయకపోతే వేధించడం కూడా అదే స్థాయిలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. రేగా అనుచరుల ఒత్తిడి భరించలేక కొందరు అధికారులు ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసేందుకు ఇష్టపడడం లేదు. తమకు ట్రాన్స్‌ఫర్ కావాలంటూ ఉన్నతాధికారులను సైతం కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అక్రమాలకు సహకరించాలంటూ..

పినపాక నియోజకవర్గంలో 1/70 యాక్ట్ అమలులో ఉండగా... ఈ ప్రాంతంలో అక్రమార్కులు బహుళ అంతస్తులు నిర్మించడం, అనుమతులు లేకుండా భవంతులు కట్టడం, రియల్ వెంచర్లు.. ప్రభుత్వ భూముల కబ్జా.. అడ్డగోలుగా బోర్లు వేయడం.. ఇసుక మాఫియా ఇలా ఒకటేమిటి.. రకరకాల అక్రమాలకు తెరతీయడమే కాదు.. వాటి అనుమతుల కోసం ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తుండడం గమనార్హం. అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకోబోయిన అధికారులను వీరు వేధించడం ఆనవాయితీగా మారింది. దాదాపు అన్ని మండలాల్లో ఎమ్మెల్యే రేగా అండతో ఆయన అనుచరులు జోరుగా అక్రమ పెత్తనం చేస్తున్నారు.

లేకుంటే వేధింపులే..

అధికార పార్టీకి చెందిన నేతలు కాబట్టి తమ పనులు చక్కబెట్టాల్సిందేనని ప్రభుత్వ కార్యాలయాల్లో వారి అనుచరులు తిష్టవేయడం గమనార్హం. తమ పనులు చేసి పెడితే సరి.. లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపుల పర్వం మొదలవుతుంది. తమకు పలుకుబడి ఉదంటూ.. మీ సంగతి చూస్తానంటూ బెదిరించడం పరిపాటి అయిందని పలువురు మండలస్థాయి అధికారులు 'దిశ ప్రతినిధి'తో చెప్పడం గమనార్హం. జిల్లా స్థాయి అధికారులతో సైతం చెప్పిస్తారని, వారు చెప్పినా వినకుంటే శాఖా పరంగా రకరకాల ఇబ్బందులకు గురిచేయడమో, లేక అర్థాంతరంగా బదిలీ చేయడమో జరుగుతుందని వారు వాపోయారు.

ఉండలేమంటూ..

రేగా కాంతారావు అనుచరుల పెత్తనం భరించలేక కొందరు ప్రభుత్వ అధికారులు స్వయంగా తమకు ఈ ప్రాంతం నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్ చేయాలంటూ ఉన్నతాధికారుల వద్ద వేడుకుంటున్నట్లు తెలిసింది. వారు చెప్పినట్లు చేస్తే అక్రమార్కులకు సహరించినట్లు అవుతుందని, అది తప్పు కాగా.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని ఓ ఉద్యోగి చెబుతున్నారు. ఒకవేళ చేయకుంటే అధికారపార్టీ నాయకుల నుంచే కాక తమ ఉన్నతోద్యోగుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుందని మరో ఉద్యోగి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయడం కత్తిమీద సాములాగా ఉందని, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఏది ఏమైనా ప్రశాంతంగా ఇక్కడ ఉండలేకపోతున్నామని, తమకు మరేదైనా ప్రదేశానికి బదిలీపై పంపించాలంటూ వేడుకోవడం అధికార పార్టీ నేతల పెత్తనానికి పరాకాష్ఠగా నిలుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.

అధికారులపై పెత్తనం..

ఇటీవల తాము చెప్పినట్లు వినడం లేదని మున్సిపల్ కమిషనర్ ను ఇక్కడ నుంచి బదిలీ చేయించారు. అంతేకాదు.. రెండ్రోజుల క్రితం పర్మిషన్ లేకుండా బోర్ వేస్తున్నారని అడ్డుకున్న తహసీల్దార్ ను ఏకంగా రేగా కాంతారావే ఆఫీస్ కు వెళ్లి, ఆయన కుర్చీలో కూర్చొని మరీ వాగ్వాదానికి దిగడం గమనార్హం. అంతేకాదు ఆయనను గంటల వ్యవధిలోనే అక్కడి నుంచి బదిలీ చేయించారు. వీరితో పాటు పోలీస్ శాఖకు చెందిన అధికారులు సైతం రేగా, ఆయన అనుచరుల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు.

పార్టీలోనూ పెత్తనం..

అధికారుల వద్దే కాదు.. రేగా, ఆయన అనుచరులు ఓ వర్గం పార్టీ నేతలపైనా పెత్తనం చేస్తున్నారు. ఇటీవల పొంగులేటి నియోజకవర్గ పర్యటన సందర్భంగా నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. రేగా అనుచరులు పరిస్థితి లాఠీ చార్జ్ వరకు తీసుకెళ్లారంటే పార్టీలో వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ కు చెందిన ఓ రాష్ట్రస్థాయి నేత పర్యటించకుండా అడ్డుకోవడంతో రేగాతో పాటు ఆయన అనుచరులు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇలా పార్టీకి చెందిన వారినే నియోజకవర్గంలోకి రానీయకుండా చేస్తున్నారంటే భవిష్యత్ లో ఇబ్బందుల తప్పవని అంటున్నారు. గతంలో కొత్తగూడెంలో కూడా ఇలాంటి పరిస్థితులో ఉండేవని, ఇప్పుడు పినపాక నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ నేతల పెత్తనం తట్టుకోలేకుండా ఉందని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే ఉంటే అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, సామాన్య ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమంటున్నారు. అంతేకాదు.. పార్టీ ప్రతిష్టకూడా దిగజారుతుందనే టాక్ వినిపిస్తుంది.

Next Story

Most Viewed