అరుణ్ సాగర్ పురస్కార సభ ..నిర్వాసితుల కోసం నిలవడమే నివాళి!

by Disha Web Desk 12 |
అరుణ్ సాగర్ పురస్కార సభ ..నిర్వాసితుల కోసం నిలవడమే నివాళి!
X

దిశ, భద్రాచలం : పోలవరం ప్రాజెక్టు మూలంగా తమ అస్తిత్వం కోల్పోతున్న లక్షలాది నిర్వాసితుల పక్షాన నిలబడటమే అరుణ్ సాగర్ కి నిజమైన నివాళి అని పలువురు వక్తలు అన్నారు.‌‌‌ సాహిత్య శిఖరంగా వెలుగొందిన ప్రముఖ కవి, పాత్రికేయుడు అరుణ్ సాగర్‌‌కు సమోన్నత స్థాయిలో నిలుపుతూ ఆదివారం "అరుణ్ సాగర్ పురస్కార సభ" జరిగింది.

సాగర్‌కు ఎంతో పేరు తెచ్చిన "మ్యూజిక్ డైస్" కు మూలమైన ఆదివాసీ ప్రాంతం భద్రాచలంలో ఏర్పాటుచేసిన ఈ సభ ఆద్యంతం సాహిత్య, పాత్రికేయ రంగాల్లో అరుణ్‌‌కి ఉన్న విశిష్టతను తెలియజేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఛిద్రం కానున్న ఆదివాసీ బతుకులు గురించి తీవ్రమైన దుఃఖం తో "మ్యూజిక్ డైస్" ద్వారా అక్షర రూపమిచ్చారు అరుణ్ సాగర్.

ఇదే అంశాన్ని వక్తలు ప్రస్తావిస్తూ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ బిడ్డలు తమ ఉనికిని, తమ స్థానికతను కోల్పోయి నిండు ఆవేదనలో మునిగిపోయారని అన్నారు. జలాశయాలే కాదు జనాశయాలు కూడా మునిగి పోతున్నాయని ఆవేదన చెందారు. అరుణ్ సాగర్ కోరుకున్నట్లు పోలవరం నిర్వాసితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడమే సాగర్‌‌కు నిజమైన నివాళి అవుతుందని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, సమాజంలోని అసంబద్దతల మీద, సాంస్కృతిక విధ్వంసం పై ప్రవహించే నదిలా అరుణ్ సాగర్ కవిత్వం సాగిందని అన్నారు. మ్యూజిక్ డైస్‌‌లో సాగర్ అంతరంగం ఆవిష్కృతమైందని ఆయన అన్నారు.

అగ్నిధారలు కురుస్తాయి.. నిశ్శబ్ద విప్లవం సిద్ధిస్తుంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

నేటి రచయితలకు, పాత్రికేయులకు శ్రీ శ్రీ, దాశరథి ఆదర్శం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు వేసిన టివిఆర్ చంద్రం స్ఫూర్తిదాయకమని అన్నారు. నేడు కలం గళం అణచివేతకు గురవుతున్నదని, పరాధీనమవుతున్నదని అన్నారు. తిరుగుబాటు గడ్డ భద్రాచలం అని అన్నారు. కమ్యూనిజంకు మరణం లేదని అన్నారు. తెలుగు ప్రజలకు వెలుగు రేఖలుగా పాత్రికేయ వృత్తిలో సేవలు అందిస్తున్న పాత్రికేయులను అభినందించారు.

ప్రతిభావంతుడైన పాత్రికేయుడు సాగర్ : సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళి

అరుణ్ సాగర్ నిస్సందేహంగా అత్యంత ప్రతిభావంతుడైన పాత్రికేయుడు అని సాక్షి సంపాదకులు వర్దెల్లి మురళి అన్నారు. ఒక తరం ముందు నడిచిన కవి అని అన్నారు. జర్నలిజం, సాహిత్య రంగాల్లో ప్రత్యేక ముద్ర వేసిన వాడు సాగర్ అని ఆయన కొనియాడారు.

కమ్యూనిజం అజేయం : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

కమ్యూనిజం అజేయమని, ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలు కూడా అజేయమైనవేనని ప్రజా వాగ్గేయ కారుడు గోరటి వెంకన్న అన్నారు. ప్రకృతిని, ప్రజలను ప్రేమించిన అరుణ్ సాగర్ సాహిత్య, పాత్రికేయ రంగాల్లో ప్రజల పక్షాన తన రచనలు సాగించారని అన్నారు.

నిర్వాసితులకు బ్రతికే భరోసా ఇవ్వాలి : ఘంటా చక్రపాణి

పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులవుతున్న ప్రజలకు బ్రతికే భరోసా ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రభుత్వంను కోరారు. జనాశయలు నీటిమయం అవుతున్నాయని ఆవేదన చెందారు. ఆ ప్రాంత వాసులుకు తమ స్థానికత ఎక్కడో అర్ధంకాక భవిష్యత్‌‌ను కోల్పోతున్నారని అన్నారు. అరుణ్ సాగర్‌‌తో కలిసి నడిచిన తామంతా అరుణ్ సాగర్ అనంతరం కూడా కలిసి నడవడం బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం నుండి హైద్రాబాద్ వచ్చిన సాగర్ ఇపుడు హైద్రాబాద్‌‌నే భద్రాచలంకు తీసుకువచ్చాడు అంటూ కొనియాడారు.

దుమ్ము ధూళి నుండి ఎగసి వచ్చిన వాడు సాగర్ : జూలూరి గౌరీశంకర్

ఆదివాసీ ప్రాంతంలోని దుమ్ము ధూళి నుండి ఎగసి వచ్చిన గొప్ప కవి అరుణ్ సాగర్ అని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరి శంకర్ అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యను మానవీయ కోణంలో చూడాలని అన్నారు. సాగర్‌‌లో ఎంతో ప్రేమించేతత్వం ఉంటుందని ఆయన చెప్పారు.

మతోన్మాదం పై అరుణ్ సాగర్ ఎలా రాసేవాడో : ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్

అరుణ్ సాగర్ నేటికీ తమతోనే ఉన్నట్లు, తమతోనే నడుస్తున్నట్లు భావిస్తున్నామని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. వివిధ సందర్భాల్లో, వివిధ అంశాలపై అరుణ్ ఉంటే ఎలా రాసేవాడో, ఎలా స్పందించేవాడో అనే భావన తమకు నిత్యం కలుగుతుందని పేర్కొన్నారు. మతోన్మాదం పెరుగుతున్న వేళ, సరిహద్దులు దాటి వచ్చిన ఆదివాసీలను తరుముతున్న సందర్భంలో అరుణ్ ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అరుణ్‌‌లో పరవళ్లు తొక్కిన అలజడిని కూడా తాము చూశామని ఆయన గుర్తు చేశారు.

జర్నలిజంను ప్రజాపక్షం చేసిన రామచంద్ర మూర్తి

తెలుగు పాత్రికేయ రంగంను ప్రజల పక్షముగా చేర్చిన గొప్ప సంపాదకీయుడు రామచంద్రమూర్తి అని పలువురు ఎడిటర్లు, కవులు ప్రశంసించారు. అరుణ్ సాగర్ జీవన సాఫల్య పురస్కారంను సీనియర్ సంపాదకులు కె. రామచంద్రమూర్తికి అందజేసి సత్కరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ పత్రికల సంపాదకులు మాట్లాడుతూ తామంతా ఆయన దగ్గర ఎదిగిన వారమే అన్నారు. ఆయన తమతో పనిచేపించి, పని నేర్పించిన గొప్పవారని పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళి మాట్లాడుతూ పత్రికల్లో అనేక శీర్షికలు ప్రవేశ పెట్టారని అన్నారు.

తెలుగు జర్నలిజం ను ప్రజల పక్షం వహించేలా చేయడంలో ఏబీకే ప్రసాద్ తర్వాత రామచంద్రమూర్తి ఉంటారని ఆయన కొనియాడారు. నూతన జర్నలిస్టులను ప్రోత్సహించడం లోను, ప్రశంసించడంలోను ఆయన ప్రత్యేకమని అన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు పత్రికల రూపురేఖలు మార్చిన వారు రామచంద్రమూర్తి అని పేర్కొన్నారు. పాత్రికేయ రంగంలో ఆయన సాగించిన కృషి ఎనలేనిదని అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచిన వామపక్ష వాది రామచంద్రమూర్తి అన్నారు. అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారం ను ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందజేసి సత్కరించారు.

ఈ అరుణ్ సాగర్ పురస్కార సభలో సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరి గౌరి శంకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రముఖ కవి మోహిద్దీన్, సోషల్ మీడియా సొల్యూషన్స్ అధినేత రాజ్ కుమార్, ప్రముఖ మూవీ, టీవీ ఆర్టిస్ట్ కిషోర్ దాస్, తెలంగాణ పబ్లికేషన్స్ అధినేత కోయ చంద్ర మోహన్, ప్రముఖ వైద్యులు రమేష్ బాబు, అరుణ్ సాగర్ సతీమణి ప్రసన్న, సోదరుడు జగన్, పాత్రికేయులు రాంబాబు, బెల్లంకొండ రామారావు, సింగు మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, అరుణ్ సాగర్ ట్రస్ట్ సభ్యులు మువ్వా శ్రీనివాసరావు (క్రాంతి) సభకు సమన్వయ కర్తగా వ్యవహరించారు.

Next Story

Most Viewed