బీఆర్ఎస్ పుట్టుక ఒక సంచలనం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ పుట్టుక ఒక సంచలనం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి(BRS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శనివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పుట్టుక ఒక సంచలనం అన్నారు. ప్రతికూలతల మధ్య రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారం అయింది. ఏమిచ్చినా తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోలేమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పడేళ్ల పాటు తమకు ప్రజలు అధికారం ఇచ్చారు.. దానిని తాము సద్వినియోగం చేశామని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదు.. అయినా వెనకడుగు వేయం.. రెట్టింపు వేగంతో దూసుకొస్తామని అన్నారు. ఈ సమయంలో తమకు అండగా ఉన్న పార్టీ శ్రేణులు, నాయకులు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగిందని గుర్తుచేశారు. తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం.. తెలంగాణ కంటూ ఉన్న ఒక ఇంటి పార్టీ అవసరం.. అదే బీఆర్ఎస్ అన్నారు.



Next Story